Fake News, Telugu
 

యేసుక్రీస్తు పై తనకు నమ్మకం లేదని, మళ్ళీ జన్మంటూ ఉంటే హిందువుగా పుట్టాలనుందని పొప్ అనలేదు

0

‘యేసుక్రీస్తు పై తనకు నమ్మకము లేదని, మళ్ళీ జన్మంటూ ఉంటె భారతీయుడిగా, హిందువుగా పుట్టాలనుందని’ వాటికన్ సిటీ కాథలిక్ చర్చి పొప్ ఫ్రాన్సిస్ తెలిపినట్టుగా షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, పొప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ వ్యాఖ్యలని బ్రిటన్ ప్రధాని సమర్ధించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యేసుక్రీస్తు పై తనకు నమ్మకం లేదని, మళ్ళీ జన్మంటూ ఉంటే హిందువుగా పుట్టాలనుందని తెలిపిన పొప్ ఫ్రాన్సిస్.

ఫాక్ట్ (నిజం): పొప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఏ ఒక్క ఆధారం దొరకలేదు. ఇప్పటివరకు పొప్ పదవిలో ఉన్న వారెవ్వరూ ఈ వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది పొప్ ఫ్రాన్సిస్ కాదు, తన కన్నా ముందు పొప్ పదవిలో ఉన్న పాప్ బెనిడిక్ట్ XVI. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్స్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్స్ కి సంబంధించిన సమాచారం కోసం వెతికితే, ఇప్పటివరకు పొప్ పదవిలో ఉన్న వారెవ్వరూ ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. పొప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఏ ఒక్క న్యూస్ రిపోర్ట్, ఆధారం మాకు దొరకలేదు. పాప్ ఫ్రాన్సిస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే, ఆ ఫోటోలో కనిపిస్తున్నది ప్రస్తుత వాటికన్ సిటీ చర్చి పొప్ ఫ్రాన్సిస్ కాదు, తన కన్నా ముందు పొప్ పదవిలో ఉన్న బెనిడిక్ట్ XVI అని తెలిసింది. పొప్ బెనిడిక్ట్ XVI  కూడా తను హిందువుగా పుట్టాలని కోరుకున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు.

కపట దైవ భక్తి చూపించడం కన్నా నాస్తికుడిగా జీవించడం మంచిదని పాప్ ఫ్రాన్సిస్ 2017లో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పారు. పొప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాని, యేసుక్రీస్తుని నమ్మకూడదని, హిందువుగా పుట్టడం తన కోరికని ఈ బహిరంగ సభలో చెప్పలేదు.

పొప్ ఫ్రాన్సిస్ యేసుక్రీస్తుని నమ్మేవాడు కాదని, నరకం అనే ప్రదేశం ఉన్నట్టు అతను ఎప్పుడూ నమ్మలేదని పొప్ ఫ్రాన్సిస్ స్నేహితుడు, ఇటలీ జర్నలిస్ట్ స్కాల్ఫరి తన ఆర్టికల్ లో తెలిపినట్టు ‘The Tablet’ న్యూస్ వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది. ఈ మాటలకి సంబంధించి ఎటువంటి ఆడియో రికార్డు, రాత పూర్వకమైన ఆధారం తన దగ్గర లేదని ఆర్టికల్ లో తెలిపారు. స్కాల్ఫరి చేసిన ఈ వ్యాఖ్యలని వాటికన్ చర్చి అధికారులు ఖండించినట్టు రిపోర్ట్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. స్కాల్ఫరి తను రాసిన ఆర్టికల్ లో పొప్ ఫ్రాన్సిస్ హిందువుగా పుట్టాలని కోరుకునట్టు ఎక్కడ ఈ ఆర్టికల్ తెలుపలేదు.

చివరగా, పొప్ ఫ్రాన్సిస్ యేసుక్రీస్తు పై తనకు నమ్మకము లేదని, మళ్ళి జన్మంటూ ఉంటే హిందువుగా పుట్టాలనుందని చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll