‘రైతులపై లాఠీ ఛార్జి చెయ్యండి అని మాకు పై నుండి ఆర్డర్లు వస్తున్నాయి. ఇక రైతులపై లాఠీ ఛార్జ్ చెయ్యము’, అని పోలీసులు చెప్తునట్టు రెండు వీడియోలను సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఒక వీడియోలో పోలీసులు ఏడుస్తూ కనిపిస్తే, మరో వీడియోలో పోలీసులు ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదాలు చేస్తున్నట్టు చూడవొచ్చు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని చెప్తున్న పోలీసుల వీడియోలు.
ఫాక్ట్: వీడియోల్లో రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని పోలీసులు చెప్పట్లేదు. మొదటి వీడియో సెప్టెంబర్ 2020 లో రాంచీ నగరంలో తీసినది. కాంట్రాక్ట్ సిబ్బంది తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ర్యాలీ నిర్వహించినప్పుడు ఇతర పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినందుకు వీడియోలోని వ్యక్తి ఏడుస్తున్నాడు. రెండో వీడియోలో నిరసనకారులను శాంతింపచేయడానికి ఢిల్లీ పోలీస్ ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ నినాదాలు చేసారు. అంతేకాదు, 200 మంది ఢిల్లీ పోలీసులు సామూహిక రాజీనామా చేసారనే వార్తలో నిజం లేదు. కావున క్లెయిమ్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో పై ‘Thefollowup’ అని రాసి ఉనట్టు గమనించవొచ్చు. ‘Thefollowup’ యూట్యూబ్ ఛానల్ లో వీడియో గురించి వెతకగా, పూర్తి వీడియోని సెప్టెంబర్ 2020 లోనే పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. జార్ఖండ్ లోని రాంచీ లో అసిస్టెంట్ పోలీస్ కాంట్రాక్ట్ సిబ్బంది తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని మరియు సరైన వేతనం ఇవ్వాలని నిరసన తెలుపుతూ, రాజ్ భవన్, ముఖ్యమంత్రి ఇంటికి ర్యాలీ నిర్వహించినప్పుడు వారి పై ఇతర పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టు తెలిసింది. తమపై లాఠీ ఛార్జ్ చేసినందుకు వీడియోలోని వ్యక్తి ఏడుస్తున్నాడు.
పై ఘటన కి సంబంధించి వివిధ వార్తాసంస్థలు సెప్టెంబర్ 2020 లో ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, పోస్ట్ లోని వీడియో తాజా రైతు నిరసనలకు సంబంధించింది కాదు, మరియు వీడియోలో పోలీసులు ఏడుస్తుంది రైతులపై లాఠీ ఛార్జ్ చేసినందుకు కాదు.
పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ వీడియోని ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ మరియు ‘ఇండియా టీవీ’ వారు కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ ర్యాలీ లో నిరసనకారులను శాంతింపచేయడానికి ఢిల్లీ పోలీస్ జాయింట్ కమీషనర్ ఎస్.ఎస్.యాదవ్ ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ నినాదాలు చేసారని తెలిసింది. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం పై పోలీసులు తిరుగుబాటు చేయలేదు.
అంతేకాదు, 200 మంది ఢిల్లీ పోలీసులు సామూహిక రాజీనామా చేసారని కొంతమంది షేర్ చేయగా, ఆ వార్తలు తప్పు అని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు వివరాణ ఇచ్చారు.
చివరగా, వీడియోల్లో రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని పోలీసులు చెప్పట్లేదు.