Fake News, Telugu
 

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు

0

అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను పట్టించుకోలేదని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. వీడియోలో మోదీ కేవలం ద్వారకా పీఠ్ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకొని, స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను పట్టించుకోనట్టు కనిపిస్తుంది. అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని స్వామి అవిముక్తేశ్వరానంద్‌ వ్యతిరేకించడమే ఇందుకు కారణమని ఈ వీడియోను షేర్ చేసిన పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను పట్టించుకోలేదు; కేవలం స్వామి సదానంద సరస్వతి ఆశీర్వాదం మాత్రమే తీసుకున్నాడు.

ఫాక్ట్(నిజం): అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి సదానంద సరస్వతి, స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నాడు. ముందుగా స్వామి అవిముక్తేశ్వరానంద్‌ నుంచి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత ద్వారకా పీఠం శంకరాచార్యుల నుంచి ఆశీస్సులు పొందారు. స్వామి అవిముక్తేశ్వరానంద్‌ మోదీకి తన మెడలోని హారాన్ని మోదీకు బహూకరించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

జనవరి 2024లో, నలుగురు శంకరాచార్యులు అయోధ్యలోని కొత్త రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం గుడి నిర్మాణం పూర్తి కాకముందే ఆచారాలకు విరుద్దంగా జరుగుతుందని అంటూ వీరు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనే నలుగురు శంకరాచార్యులలో ఒకరైన స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను మోదీ పట్టించుకోలేదని ప్రస్తుతం ఈ వీడియో షేర్ అవుతుంది.

ఐతే సోషల్ మీడియాలో చేస్తున్న ఈ వాదనల్లో నిజంలేదు. 13 జులై 2024న జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహా వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరైన రిపోర్ట్స్ కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియో రిపోర్ట్స్ ప్రకారం ప్రధాని మోదీ స్వామి సదానంద సరస్వతి, స్వామి అవిముక్తేశ్వరానంద్‌, ఇద్దరి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ దృశ్యాలను వేరే కోణంలో చూపించిన ఒక న్యూస్ రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం మోదీ ముందుగా స్వామి అవిముక్తేశ్వరానంద్‌ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని ఆ తరవాత స్వామి సదానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఐతే వైరల్ వీడియోలో కేవలం స్వామి సదానంద సరస్వతి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయినట్టు కనపడడంతో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను పట్టించుకోలేదని వాదన తలెత్తింది.

కానీ నిజానికి మోదీ ముందు స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఆశీర్వాదమే తీసుకున్నాడు. పైగా స్వామి అవిముక్తేశ్వరానంద్‌ తన మెడలోని ఒక హారాన్ని మోదీకు బహూకరించాడు కూడా. అయోధ్య వివాదం తరవాత మొదటిసారి కలుసుకోవడంతో మీడియా కూడా ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేసింది (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే స్వామి అవిముక్తేశ్వరానంద్‌ మీడియాతో మాట్లాడుతూ ‘మోదీ తమ శత్రువేమీ కాదని, తాము ఆయన మేలు కోరేవారమని, మా దగ్గరికి వచ్చిన వారిని ఆశీర్వదించడం తమ బాధ్యతని అన్నారు.’

చివరగా, అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి సదానంద సరస్వతి మరియు స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll