Fake News, Telugu
 

పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్టు ప్రధాని మోదీ తెలిపారు

0

పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసిన మోదీ ప్రభుత్వం”, అని చెప్తూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో చాలా  మంది షేర్ చేస్తున్నారు​​. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసిన మోదీ ప్రభుత్వం.

ఫాక్ట్: అనుకున్న దానికంటే 5 నెలల ముందుగానే పెట్రోల్‌లో 10% ఇథనాల్ కలపడం సాధించినట్టు తాజాగా ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాదు, పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) ఆదా అయినట్టు తెలిపారు. ఇదే విషయం మంత్రి అశ్వినీ కుమార్ కూడా చెప్పారు. కాబట్టి, ఆదా అయింది 41,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం, ప్రజా ధనం కాదు. ఇతర దేశాల నుండి ముడి చమురును  ఆయిల్ రిఫైనరీ కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. కావున పోస్ట్‌లో ఆదా అయింది విదేశీ మారక ద్రవ్యం అని చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, తాజాగా ప్రధాని మోదీ ఈ విషయంపై  మాట్లాడినట్టు తెలిసింది. ఇషా ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై పీఐబీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌ని ఇక్కడ చదవచ్చు. ఆ ప్రెస్ రిలీజ్‌లో – “ఇంధనంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు 5 నెలలు ముందుగానే భారత్ నేడు సాధించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ఘనత ఎంత బృహత్తరమైనదో వివరిస్తూ- 2014లో ఇథనాల్ మిశ్రమం 1.5 శాతమేనని ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్య సాధనతో మూడు స్పష్టమైన ప్రయోజనాలు సమకూరాయని ప్రధాని తెలిపారు. మొదటిది- 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు; రెండోది- రూ.41 వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా; మూడోది- ఇథనాల్ మిశ్రమం ద్వారా గడచిన ఎనిమిదేళ్లలో దేశంలోని రైతులు రూ. 40,600 కోట్లు ఆర్జించగలిగారని వివరించారు. ఈ ఘనత సాధించడంపై దేశ ప్రజలు, రైతులు, చమురు కంపెనీలను ప్రధాని అభినందించారు”, అని ఉన్నట్టు చదవచ్చు. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) ఆదా అయినట్టు మంత్రి అశ్వినీ కుమార్ కూడా చెప్పారు. 2025-26 కల్లా పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపటం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే, ఆదా అయింది 41,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్), ప్రజా ధనం కాదు. ఇతర దేశాల నుండి ముడి చమురును ఆయిల్ రిఫైనరీ కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి.

ప్రస్తుతం ఉన్న వాహనాలు (2008 తరువాత విక్రయించినవి) ఎటువంటి ఇబ్బంది లేకుండా E10 (10% ఇథనాల్‌ ఉన్న పెట్రోల్) ఇంధనంతో నడుస్తాయి. అయితే, E20 ఇంధనం ఉపయోగించాలంటే వాహనాలకు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇథనాల్ బ్లెండింగ్ పై ‘నీతి ఆయోగ్‌’ వారు విడుదల చేసిన రిపోర్టులో మరిన్ని వివరాలు చూడవచ్చు.

అరబ్బు దేశాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోడీ. 41,000 కోట్ల క్రూడ్ ఆయిల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్!”, అని కొందరు మరొక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, అలాంటి ఒక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్నట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. ‘41,000 కోట్లు’ అనే  సంఖ్య కూడా విదేశీ మారక ద్రవ్యం యొక్క ఆదా నుండి తీసుకున్నట్టు ఉన్నారు. కాబట్టి, ఈ పోస్టులో చెప్పింది కూడా తప్పే.

చివరగా, పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్టు ప్రధాని మోదీ తెలిపారు.

Share.

About Author

Comments are closed.

scroll