Coronavirus Telugu, Fake News, Telugu
 

భారత దేశంలో తయారయ్యే వాక్సిన్లు ప్రమాదకరమైనవని పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ దుష్ప్రచారం చేయలేదు

0

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్, కూతురు వీణ భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్లు ప్రమాదకరమని దుష్ప్రచారం చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఈ ఫోటోలో పినరయి విజయన్ కూతురు, ఆమె భర్త CPI(M) పార్టీ జెండా మరియు మలయాళం భాషలో రాసి ఉన్న బ్యానర్లని పట్టుకొని నిరసన చేస్తున్న దృశ్యం మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ మరియు కూతురు వీణ భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ప్రమాదకరమని దుష్ప్రచారం చేస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాక్సిన్ అందించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్, కూతురు వీణ ఈ నిరసన చేపట్టారు. భారత దేశంలో తయారయ్యే వాక్సిన్లు ప్రమాదకరమైనవని వారు ఈ నిరసనలో ప్రచారం చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో కోసం కొన్ని పదాలు వాడి గూగుల్ లో వెతికితే, ఇదే ఫోటోని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ 28 ఏప్రిల్ 2021 నాడు తన అధికారిక ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. ప్రజలకి ఉచిత వాక్సిన్ అందించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినందుకు గాను ఈ నిరసన చేపడుతున్నట్టు మహమ్మద్ రియాజ్ తన పోస్టులో తెలిపారు. భారత దేశంలో తయారయ్యే వాక్సిన్లు ప్రమాదకరమని మహమ్మద్ రియాజ్ ఈ పోస్టులో ఎక్కడా తెలుపలేదు.

ఈ ఫోటోలో పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్, కూతురు వీణ విజయన్ పట్టుకొని ఉన్న బ్యానర్ల పై రాసి ఉన్న మలయాళం అక్షరాలని అనువాదం చేసి చూడగా,  వారు కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాక్సిన్ అందించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేసినట్టు స్పష్టమయ్యింది. ఆ బ్యానర్ తెల్లటి భాగం పై రాసి ఉన్న అక్షరాలని అనువాదం చేయగా, దాని పై ‘కోవిడ్ వాక్సిన్లని ఉచితంగా అందించకపోవడం ద్వార మానవ జీవితానికి విలువ చూపని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన (ప్రజలు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని విజ్ఞప్తి)’, అని రాసి ఉన్నట్టు అర్ధమయ్యింది. అలాగే, బ్యానర్ నలుపు భాగంలో రాసి ఉన్న అక్షరాలని అనువాదం చేసి చూస్తే, దాని పై ‘అందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్లను అందించినందుకు కేరళ ప్రభుత్వానికి అభినందనలు’ అని రాసి ఉన్నట్టు తెలిసింది.

ఉచిత వాక్సిన్లకు సంబంధించి పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ చేసిన ఈ నిరసనని వ్యతిరేకిస్తూ కేరళ బీజేపి నాయకుడు సందీప్ వాచస్పతి చేసిన వ్యాఖ్యలని, ‘East Coast Daily’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి వాక్సిన్లు ఉచితంగానే అందిస్తున్నట్టు సందీప్ వాచస్పతి తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో పినరయి విజయన్ కుటుంబం ఉచిత వాక్సిన్లను డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాక్సిన్లు అందించాలని పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ చేసిన నిరసనని భారతదేశంలో తయారయ్యే వాక్సిన్లు ప్రమాదకరమని దుష్ప్రచారం చేస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll