24 నవంబర్ 2024న, ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో అధికారులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది పోలీసులు గాయపడ్డారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “సంభల్ మసీద్ సర్వేలో బయటపడిన 1500సం.రాల నాటి విష్ణు మూర్తి విగ్రహం, సుదర్శన చక్రం వంటి పలు హిందూ చిహ్నలు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా , విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం మరియు సుదర్శన చక్రాన్ని చూపించే 4 ఫోటోలను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఈ ఫోటోలు సంభల్ మసీదు సర్వేలో బయటపడిన 1500 సం.రాల నాటి విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం, సుదర్శన చక్రానివి.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలలో కనిపిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో కనుగొనబడ్డాయి. అలాగే, ఈ కథనం రాసే వరకు, సంభల్ మసీదులో హిందూ దేవతా విగ్రహాలు దొరికినట్లు ఎటువంటి ఆధారాలు/రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో చెప్పినట్లుగా ఇటీవల జరిగిన సంభల్ మసీదు సర్వేలో పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడ్డాయా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, సంభల్ మసీదు సర్వేలో పురాతన హిందూ విగ్రహాలు లభించాయి అని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. అలాగే ఈ సర్వే రిపోర్ట్ ఇంకా బహిర్గతం అవలేదు అని తెలిసింది, అలాగే ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టే వరకు ఈ సర్వే రిపోర్టును గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిసింది.
ఇకపోతే వైరల్ ఫోటోలకు సంబంధించిన సమాచారం కోసం, ఈ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే ఫోటోలను 07 ఫిబ్రవరి 2024న NDTV తన అధికారిక X(ట్విట్టర్)లో షేర్ (ఆర్కైవ్డ్) చేసినట్లు గుర్తించాము. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విగ్రహాలు కర్ణాటకలో నదిగర్భంలో లభించినట్లు పేర్కొంటూ, NDTV పబ్లిష్ చేసిన వార్త కథనం లింక్ షేర్ చేసింది.
ఈ కథనం ప్రకారం, ఈ విగ్రహాలు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో తెలంగాణ-కర్ణాటక సరిహద్దు సమీపంలో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో కనుగొనబడ్డాయి, విష్ణు విగ్రహం మరియు శివలింగం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధీనంలో ఉన్నాయి. ఇవే విగ్రహాల ఫోటోలను రిపోర్ట్ చేస్తూ ఇదే విషయాన్ని పేర్కొంటూ ఫిబ్రవరి 2024లో ప్రచురించబడిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. వైరల్ పోస్టులో కనిపించే సుదర్శన చక్రం వివరాలు మాకు తెలియనప్పటికీ, ఇది స్టాక్ ఇమేజ్ అని తెలుస్తుంది మరియు సంభల్ మసీదు సర్వేకు ఎటువంటి సంబంధం లేదని మేము నిర్ధారించగలము.
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలోని చందౌసిలోని షాహీ జామా మసీదును 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చివేసి నిర్మించాడని పేర్కొంటూ న్యాయవాది హరి శంకర్ జైన్, మహంత్ రిషిరాజ్ గిరితో సహా ఎనిమిది మంది వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సంభాల్ జిల్లా కోర్టు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), 19 నవంబర్ 2024న మొఘలుల నాటి షాహీ జామా మసీదును అడ్వకేట్ కమీషనర్ ద్వారా మసీదును సర్వే చేయడానికి అనుమతిస్తూ ఎక్స్-పార్ట్ ఆర్డర్ జారీ చేసింది (ఇక్కడ). న్యాయవాది రమేష్ చంద్ రాఘవ్‌ను ఈ సర్వేకు అడ్వకేట్ కమిషన్‌గా వ్యవహరించాలని ఆదేశించారు. మొదటి విడతగా 19 నవంబర్ 2024న సర్వే చేశారు, అలాగే 24 నవంబర్ 2024న జరిగిన రెండో విడత సర్వే సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో అధికారులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది పోలీసులు గాయపడ్డారు (ఇక్కడ, ఇక్కడ).
సంభల్ జిల్లాలోని షాహీ జామా మసీదును సర్వే చేయాలని అడ్వకేట్ కమిషనర్‌ను ఆదేశిస్తూ 19 నవంబర్ 2024న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సంభల్ షాహి జామా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం 29 నవంబర్ 2024న విచారించింది. ఈ సందర్భంగా మసీదు నిర్వహణ కమిటీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ సంభాల్ జిల్లా కోర్టు/ ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే విధించాలని బెంచ్‌ను కోరారు, కానీ బెంచ్ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే, ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని షాహీ జామా మసీదు మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించింది. “శాంతి, సమగ్రతలను పరిరక్షించాలి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి. తటస్థంగా వ్యవహరించాలి” అని యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చేవరకు ట్రయల్ కోర్టు తదుపరి విచారణ చేపట్టొద్దని ఆదేశించింది. అలాగే, సర్వే నిర్వహించడానికి ట్రయల్ కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ ఏదైనా నివేదికను సమర్పిస్తే, దానిని సీల్డ్ కవర్‌లో ఉంచాలని, తెరవకూడదని కోర్టు ఆదేశిస్తూ 06 జనవరి 2025కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి 29 నవంబర్ 2024న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఈ ఫోటోలలో కనిపిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం మరియు శివలింగం ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో కనుగొనబడ్డాయి. సంభల్ మసీదు సర్వేలో పురాతన హిందూ విగ్రహాలు లభించాయి అని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు.