Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో నిరసనకారులు నమాజ్ చేస్తున్న వీడియోని తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

0

బంగ్లాదేశ్‌లో కొందరు ఇస్కాన్ సాధువుల అరెస్ట్ (ఇక్కడ, ఇక్కడ), ఆ దేశంలో కలకలం రేపింది. అలాగే అక్కడ ఇస్కాన్ ఆరాధన స్థలం పైన దాడులు జరిగాయి అని చెప్పి కొన్ని వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి . ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హిందువులని బందీలుగా చేసి చంపుతామని బెదిరించి వాళ్ల మతాన్ని మారుస్తున్న ఘటనకు చెందిన దృశ్యాలు అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు రోడ్డుపై మోకరిల్లి నమాజ్ (ప్రార్థనలు) చేస్తుండగా, కొంతమంది వ్యక్తులు కర్రలు పట్టుకుని వారి చుట్టూ నిలబడటం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూడవచ్చు. 

ఈ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో హిందువులను బందీలుగా ఉంచి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిన దృశ్యాలను చూపుతున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కోటా వ్యతిరేక నిరసన సందర్భంగా నిరసనకారులు నమాజ్ చేస్తున్న దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుంది. ఇది 16 జూలై 2024న, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, బషుంధరా గేట్ ముందు రహదారిని అడ్డుకుని కొందరు విద్యార్థులు నిరసన తెలిపినప్పటి వీడియో. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

 వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు లభించింది. 16 జూలై 2024న ‘SOMOY TV Bulletin’ అనే బంగ్లాదేశ్ మీడియా సంస్థ, ఈ వీడియోని YouTubeలో అప్‌లోడ్ చేసింది. 

బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న బషుంధరాలో నిరసన తెలుపుతున్న కొందరు విద్యార్థులు, జుహర్ ప్రార్థనలు, అనగా ముస్లింలు రోజుకు ఐదుసార్లు చేసే ప్రార్థనలలో ఒకటి, చేస్తున్నారు అని వీడియో యొక్క టైటిల్ పేర్కొంది. 

అదనంగా, 16 జూలై 2024న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో రిజర్వేషన్ ఆందోళన సందర్భంగా విద్యార్థులు రోడ్డుపై జుహర్ నమాజ్ చేస్తున్న దృశ్యాలు అని వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల వంటి విజువల్స్ ఉన్న కొన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) కూడా మాకు లభించాయి (ఆర్కైవ్ లింక్). 

ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ వీడియోలోని ఒక ఒక కీఫ్రేమ్‌ ఉన్న SomoyNews TV వారి వార్తా కథనం ఒకటి మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, 16 జూలై 2024న వివిధ ప్రైవేటు విశ్వవిద్యాలయాల విద్యార్థులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బషుంధరా గేట్ ముందు రహదారిని దిగ్బంధించి ఒక నిరసన చేపట్టారు. గంటపాటు నిరసన తెలిపిన తర్వాత, కొంతమంది విద్యార్థులు వరుసగా కూర్చుని జుహర్ నమాజ్ చేశారు. పక్కన నిల్చున్న మిగిలిన విద్యార్థులు నినాదాలు, నిరసనలు కొనసాగించారు అని ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు.

అలాగే 16 జూలై 2024న ఢాకా ప్రెస్, ప్రొబషిర్డిగంట మరియు బంగ్లాదేశ్ మూమెంట్స్ అనే మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు కూడా ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. వీడియోలోని విజువల్స్ 16 జూలై 2024న ఢాకాలోని బషుంధరా గేట్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా విద్యార్థులు జుహర్ నమాజ్ చేస్తున్నప్పుడు తీసినవి అని ఈ కథనాల్లో ఉంది.

కావున, బంగ్లాదేశ్‌లో రోడ్డుపై నిరసనకారులు నమాజ్ చేస్తున్న వీడియోని తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll