ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హిందూ వేషాధారణలో హాజరవుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో మూడు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఒక సభలో నుదుట పసుపు నామం, చేతికి, మెడలో జపమాల ధరిస్తూ కనిపించిన ప్రియాంక గాంధీ, ఇదివరకు, కేరళ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మెడలో జీసస్ శిలువ లాకెట్ ధరించినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో హిందు వేషధారణలో ఉన్న ప్రియాంక గాంధీ, కేరళలో క్రిస్టియన్ వేషధారణ వేసింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, ఇటీవల వారణాసిలో నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తుండగా తీసారు. అలాగే, పోస్టులోని రెండో ఫోటో, 2019లో ప్రియాంక గాంధీ మూడు రోజుల గంగా యాత్రలో భాగంగా వారణాసిని సందర్శించినప్పుడు తీసారు. ప్రియాంక గాంధీ జీసస్ శిలువ ధరించిన మూడో ఫోటో ఎడిట్ చేయబడినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈపోస్టులో షేర్ చేసిన మూడు వేర్వేరు ఫోటోల వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
ఫోటో-1:
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఇటీవల పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో 10 అక్టోబర్ 2021 నాడు నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తున్న దృశ్యాలని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ నుదుట పసుపు నామం, చేతికి జపమాల ధరించుకొని వచ్చింది.
ఫోటో-2:
అయోధ్యలో జపమాల మెడపై ధరించి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు షేర్ చేసిన రెండో ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వేషాధారణతో ఉన్న ప్రియాంక గాంధీ ఫోటో ‘Getty’ ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో పబ్లిష్ అయినట్టు తెలిసింది. 20 మార్చ్ 2019 నాడు ప్రియాంక గాంధీ మూడు రోజుల గంగా యాత్రలో భాగంగా వారాణసి నగరాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో అని వివరణలో తెలిపారు. ఈ ఫోటోలలో ప్రియాంక గాంధీ మెడపై జపమాల ఉండటాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు.
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని ఇదివరకు, ప్రియాంక గాంధీ మెడలో బ్రాహ్మణ జంజం ధరించిందని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ప్రియాంక గాంధీ మెడపై ఉన్న తెలుపు దారాన్ని ఒక సాధు దశశ్వమేద ఘాట్ దగ్గర వేసినట్టు ‘Amar Ujala’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు ఈ ఫోటోని అయోధ్యలో తీయలేదు.
ఫోటో-3:
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Getty’ ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో పబ్లిష్ అయినట్టు తెలిసింది. 17 ఫిబ్రవరి 2017 నాడు ఉత్తరప్రదేశ్ రాయి బరేలిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతున్న దృశ్యాలంటూ ఈ ఫోటో వివరణలో తెలిపారు. కాని, ఈ ఒరిజినల్ ఫోటోలో ప్రియాంక గాంధీ మేడపై జీసస్ శిలువ లాకెట్ ధరించలేదు. ఈ ఫోటో పోస్టులో తెలుపుతున్నట్టు ప్రియాంక గాంధీ కేరళ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసినది కాదు.
2017లో ప్రియాంక గాంధీ రాయి బరేలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఇదివరకు, ఈ ఫోటోని ఇదే క్లెయింతో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, ఉత్తరప్రదేశ్‌లో హిందుగా మారిన ప్రియాంక గాంధీ కేరళలో క్రిస్టియన్ వేషధారణ వేసిందని షేర్ చేస్తున్న ఫోటో ఎడిట్ చేయబడింది.