Fake News, Telugu
 

ఈ ఫోటో బంగ్లాదేశ్ లో జరిగిన ఊరేగింపుకి సంబంధించింది, దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలది కాదు

0

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్ ధరించకుండా వందల సంఖ్యలో జనాలు ఊరేగింపుగా వెళ్తున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ, ఇది ఇటీవల ఆఫ్ఘానిస్తాన్ లో మృతి చెందిన జర్నలిస్ట్ దానిశ్‌ సిద్దీఖి అంత్యక్రియల ఊరేగింపుదంటూ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్ ధరించకుండా వందల సంఖ్యలో జనాలు జర్నలిస్ట్ దానిశ్‌ సిద్దీఖి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2019లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన ఊరేగింపుకి సంబంధించింది. దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలు 18 జూలై 2021న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో జరిగాయి. ఐతే పోలీసులు సూచించినప్పటికీ ఈ కార్యక్రమంలో ప్రజలు కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తూ భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాకపోతే ఈ ఫోటోకి దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే విజువల్స్ కలిగిన ఒక యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోని 13 నవంబర్ 2019న అప్లోడ్ చేసారు. ఈ వీడియోలోని వ్యాన్ పోస్టులోని ఫోటోలో ఉన్న వ్యాన్ ఒకేలా ఉండడం చూడొచ్చు. ఐతే యూట్యూబ్‌లోని ఈ వీడియో టైటిల్ ప్రకారం ఈ వీడియో బంగ్లాదేశ్‌కి సంబంధించినట్టు తెలుస్తుంది.

యూట్యూబ్‌ వీడియో సమాచారం ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా, యూట్యూబ్‌లో ఇదే ఊరేగింపుకి సంబంధించిన మరికొన్ని వీడియోలు (ఇక్కడ మరియు ఇక్కడ)తో పాటు బంగ్లాదేశీ న్యూస్ వీడియోలు (ఇక్కడ) కనిపించాయి. ఈ న్యూస్ వీడియో కింద ఇచ్చిన వివరణ ప్రకారం ఇది చిట్టగాంగ్‌లో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా జరిగిన  ఊరేగింపుకి సంబంధించింది.

గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, 2019లో  బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఊరేగింపుకి సంబంధించిన వార్తా కథనం కనిపించింది. హజ్రత్ ముహమ్మద్ అనే ప్రవక్త పుట్టిన, మరణించిన రోజున ఈద్-ఎ-మిలాదున్నబి జరుపుకుంటారు. ఈ సందర్భంగా చిట్టగాంగ్‌లో ‘జష్నే జూలుష్’ అనే పేరుతో ఒక ఊరేగింపు నిర్వహించారు. ఫేస్ బుక్‌లో ఈ ఊరేగింపుకి సంబంధించిన ఒక యూసర్ షేర్ చేసిన వీడియోలో అచ్చం పోస్టులోని ఫోటోని పోలిన విజువల్స్ చూడొచ్చు. ఈ ఆధారాల్ని బట్టి ఈ ఫోటో 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ఊరేగింపుదని స్పష్టంగా అర్ధమవుతుంది.

పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ దానిశ్‌ సిద్దిఖీ ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లకి ,  ప్రభుత్వ దళాల మధ్య జరుగుతున్న దాడులను కవర్ చేస్తున్న సందర్భంలో తాలిబన్ల దాడిలో మరణించాడు. దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలు 18 జూలై 2021న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో జరగగా, ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు. పోలీసులు, జామియా మిలియా ఇస్లామియా అడ్మినిస్ట్రేషన్ ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించాలని కోరినప్పటికీ, ఈ కార్యక్రమానికి సంబంధించి ట్విట్టర్ లో షేర్ అవుతున్న ఫోటోలని బట్టి ప్రజలు కోవిడ్ నియమాలు ఉల్లంగించారని అర్ధమవుతుంది.

చివరగా, ఈ ఫోటో బంగ్లాదేశ్ లో జరిగిన ఊరేగింపుకి సంబంధించింది, దానిశ్‌ సిద్దిఖీ అంత్యక్రియలది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll