Fake News, Telugu
 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఫోటోని జగిత్యాల కలెక్టర్ అధికార గర్వాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం కేసీఆర్ కూతురు కవిత ముందు మోకాళ్ళపై కూర్చొని వినయాన్ని ప్రదర్శించిన జగిత్యాల కలెక్టర్, సామాన్య మహిళా పేషెంట్ల ముందు బూటు కాళ్ళు చూపిస్తూ అధికార గర్వాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జగిత్యాల కలెక్టర్ కేసీఆర్ కూతురు కవిత ముందు మోకాళుపై కూర్చొని సామాన్య మహిళల ముందు బూటు కాళ్లు చూపిస్తూ అధికార గర్వాన్ని ప్రదర్శించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటోని 2017లో జగిత్యాల జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో తీసారు. ఈ ఫోటోలో కల్వకుంట్ల కవిత ముందు మోకాలిపై కూర్చున్నది అప్పటి మెట్‌పల్లి సబ్-కలెక్టర్ ముషారఫ్ అలీ,  జగిత్యాల కలెక్టర్ కాదు. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటో, 2016లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి జగదీష్ సొంకర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళా పేషెంట్ బెడ్డుపై కాళ్ళు పెట్టి మాట్లాడిన దృశ్యాలని చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన రెండు ఫోటోలలో కనిపిస్తున్నది ఇప్పటి జగిత్యాల కలెక్టర్ జి. రవి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన రెండు వేర్వేరు ఫోటోల వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘డెక్కన్ క్రానికల్’ వార్తా సంస్థ 27 జనవరి 2017 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మెట్‌పల్లి సబ్-కలెక్టర్ ముషారఫ్ అలీ కవిత ముందు మోకాలిపై కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

2017లో జగిత్యాల జిల్లాలో జరిగిన మొట్టమొదటి  గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి కవిత హాజరయినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి సబ్-కలెక్టర్ ముషారఫ్ అలీ కవితతో సంభాషిస్తుండగా ఈ ఫోటోని తీసారు. HMTV వార్తా సంస్థ ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 27 జనవరి 2017 నాడు పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతదని, అలాగే ఈ ఫోటోలో కనిపిస్తున్నది జగిత్యాల కలెక్టర్ జి. రవి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2016లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ ఐఏఎస్ అధికారి జగదీష్ సొంకర్ అని ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. జగదీష్ సొంకర్ బల్రాంపూర్ పట్టణంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్ల పడకపై కాళ్ళు పెట్టి వారితో మాట్లాడినట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసారు.  

అధికార గర్వం ప్రదర్శించిన విధంగా ఉన్న తన చర్యకు జగదీష్ సొంకర్ బహిరంగ క్షమాపణ తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ది ఇండియన్ ఎక్ష్ప్రెస్’ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ ఐఏఎస్ అధికారికి సంబంధించిన పాత ఫోటో అని, జగిత్యాల కలెక్టరుకు సంబంధించిన ఫోటో కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఫోటోని జగిత్యాల కలెక్టర్ సామాన్య మహిళల ముందు అధికార గర్వాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll