Fake News, Telugu
 

పతంజలి సంస్థ తమ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విదేశాలకు విక్రయించడానికి హలాల్ సర్టిఫికేట్ పొందింది, బీఫ్ ఎగుమతి చేయడానికి కాదు

0

బీఫ్ అమ్మకాలు ప్రారంభించడం కొరకు హలాల్ సర్టిఫికెట్ పొందిన పతంజలి రాందేవ్ బాబా అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పతంజలి సంస్థకు మంజూరైన హలాల్ సర్టిఫికేట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీఫ్ అమ్మకాలు ప్రారంభించడం కొరకు హలాల్ సర్టిఫికెట్ పొందిన పతంజలి రాందేవ్ బాబా

ఫాక్ట్(నిజం): పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ తమ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విదేశాలలో విక్రయించేందుకు హలాల్ సర్టిఫికేట్ పొందింది. ఈ సంస్థ ఎలాంటి జంతు ఉత్పత్తులను విక్రయించడం లేదు. హలాల్ అనేది మాంసం పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు, శాకాహార ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేషన్ వర్తిస్తుంది.  చాలా దేశాలు(ముఖ్యంగా ముస్లిం దేశాలు) తాము దిగుమతి చేసుకొనే ఉత్పత్తులకు ఈ హలాల్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసాయి. ఈ నేపథ్యంలోనే పతంజలి కూడా తమ సంస్థ విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తుల కోసం ఈ సర్టిఫికేషన్‌ను పొందింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం వైరల్ అవుతున్నట్టు పతంజలి సంస్థకు నిజంగానే హలాల్ సర్టిఫికేషన్ ఉంది. ఆ సంస్థ విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై హలాల్ సర్టిఫైడ్ ముద్ర కూడా ఉంటుంది. ఐతే సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నట్టు పతంజలి సంస్థ బీఫ్ (గో మాంసం) ఎగుమతి కోసం ఈ సర్టిఫికేట్ పొందలేదు.

హలాల్ అనేది మాంసం పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు, శాకాహార ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేషన్ వర్తిస్తుంది. కేవలం ఆహార రంగానికి మాత్రమే కాకుండా కాస్మెటిక్స్, దుస్తులు, రియల్ ఎస్టేట్, మెడికల్, హోటల్ రంగాల్లో కూడా ఈ హలాల్ పద్దతి వ్యాపించింది, ఈ సంస్థలు కూడా హలాల్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి.

హలాల్ సర్టిఫికేషన్ అనే కేవలం ముడి పదార్థాలకు సంబంధించి మాత్రమే కాకుండా, ఒక ప్రోడక్ట్ తయారీకి సంబంధించిన ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్, నిల్వ మరియు రవాణా వంటి అన్ని ప్రక్రియలకు వర్తిస్తుంది. ప్రస్తుతం చాలా దేశాలు (ముఖ్యంగా ముస్లిం దేశాలు) తాము దిగుమతి చేసుకొనే ఉత్పత్తులకు ఈ హలాల్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసాయి. అందుకే భారత్ నుండి ఈ దేశాలకు ఎగుమతి చేసే చాలా వరకు సంస్థలు ఈ సర్టిఫికేషన్‌ను పొందుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పతంజలి కూడా తమ సంస్థ విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తుల కోసం ఈ సర్టిఫికేషన్‌ను పొందింది. పతంజలి సంస్థ బీఫ్/గో మాంసం లేదా ఇతర జంతు ఉత్పత్తుల కోసం ఈ సర్టిఫికేట్ పొందలేదు. ఈ సంస్థ జంతు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్టు కూడా ఎటువంటి సమాచరం లేదు. ప్రస్తుతం షేర్ అవుతున్న హలాల్ సర్టిఫికేట్ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ 2016లో పొందింది, దీని వ్యాలిడిటీ 2017లో ముగిసిపోయింది. ఆ తర్వాత కూడా ఈ సంస్థ హలాల్ సర్టిఫికేట్ పొందింది (ఇక్కడ మరియు ఇక్కడ).

2020లో పతంజలి హలాల్ సర్టిఫికేట్‌కు సంబంధించి ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ స్పందిస్తూ తమ సంస్థ (పతంజలి ఆయుర్వేద్) అరబ్ దేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న తమ ఆయుర్వేద మందులకు ‘హలాల్’ సర్టిఫికేట్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ దేశాలలో విక్రయించాలనుకునే ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ తప్పనిసరి కావడంతో, తమ సంస్థ కూడా ఈ సర్టిఫికేట్ పొందిందని తెలిపాడు.

ఇదిలా ఉంటే భారత దేశంలో అమలులో ఉన్న ఎక్ష్పొర్ట్ పాలసీ ప్రకారం బీఫ్ (ఆవు,దూడ,ఎద్దు) మాంసాల ఎగుమతులపై నిషేధం ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే బీఫ్ పేరుతో జరిగేది గేదె మాంసం ఎగుమతులు మాత్రమే, ఆవు మాంసం కాదు. అంటే పతంజలి సంస్థ గో మాంసం ఎగుమతి చేసే ఆస్కారమే లేదు. కాబట్టి వైరల్ పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, పతంజలి సంస్థ తమ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విదేశాలకు విక్రయించడానికి హలాల్ సర్టిఫికేట్ పొండిది, బీఫ్ ఎగుమతి చేయడానికి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll