Fake News, Telugu
 

హిజాబ్ వివాదానికి సంబంధించిన పాత వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం యువతులు బురఖా ధరించి కాలేజీలకు వెళ్తున్న ఇటీవల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. కర్ణాటక కాలేజీలలో ముస్లిం యువతులు బురఖా ధరించడంపై ఆంక్షలు విధించారని, కానీ అల్లా ఆశీస్సులతో మళ్ళీ ఈ రోజు ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్లగలుగుతున్నారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ గెలుపు భారత రాజ్యాంగానికి అంకితమని తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తరువాత ముస్లిం యువతులు మళ్ళీ హిజాబ్ ధరించి కాలేజీలకు వెళుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2022 ఫిబ్రవరి నెలలో హిజాబ్ వివాద సమయంలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా సాగర నగరంలోని ఒక జూనియర్ కాలేజీలో ముస్లిం మద్దతుదారుల మధ్య ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కాలేజీ లోపటికి ప్రవేశిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి దృశ్యాలను ఈ వీడియో చూపించడం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు ఫేస్‌బుక్ యూసర్లు 2022 ఫిబ్రవరి నెలలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ ఫేస్‌బుక్ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. చివరకు, విధ్యార్ధినులను హిజాబ్ ధరించి కాలేజీలకు ప్రవేశించడానికి అనుమతిచ్చినట్టు ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ వీడియో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా సాగర నగరంలోని ఒక జూనియర్ కాలేజీలో తీసినట్టు తెలిసింది. ఈ వీడియో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు సంబంధించినదని తెలుపుతూ 08 ఫిబ్రవరి 2022 నాడు పెట్టిన ఫేస్‌బుక్ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ముస్లిం మద్దతుదారుల రక్షణ మధ్య ముస్లిం యువతులు హిజాబ్ ధరించి కాలేజీ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలని ఈ పోస్టులలో తెలిపారు.

08 ఫిబ్రవరి 2022 నాడు హిజాబ్ వివాదానికి సంబంధించి శివమొగ్గ జిల్లా సాగర నగరంలోని ఒక జూనియర్ కాలేజీలో హిందువులకు ముస్లింలు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కాలేజీ గేటు ఎదుట ముస్లింలు ధర్నా చేస్తుండగా హిజాబ్ ధరించిన ముస్లిం యువతులు బయట నిలుచున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాదు, ఈ వీడియోలో కనిపిస్తున్న కాలేజీ గేటు, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న కాలేజీ గేటు ఒకే విధంగా ఉంది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి దృశ్యాలను చూపించడం లేదని  ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హిజాబ్ వివాదానికి సంబంధించిన పాత వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముస్లిం యువతులు స్వేచ్చగా హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll