Fake News, Telugu
 

కేరళలో RSS మద్దతుదారున్ని ముస్లింలు హత్య చేశారంటూ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా 2017లో కేరళలో ప్రదర్శించిన ఒక వీధి నాటకానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌(RSS) మద్దతుదారు మహిళను కారులోంచి బయటకు లాగి మార్కెట్‌ మధ్యలో ముస్లింలు కాల్చిచంపారని, ఆర్‌ఎస్‌ఎస్‌(RSS), బీజేపీ(BJP)కి మద్దతిస్తే హిందువులకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌(RSS) మద్దతుదారు మహిళను కారులోంచి బయటకు లాగి మార్కెట్‌ మధ్యలో ముస్లింలు తుపాకితో కాల్చి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు కేరళలో జర్నలిస్ట్  గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శించిన వీధి నాటకానికి(street play)  సంబంధించినవి. సెప్టెంబరు 2017లో, సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యలో RSS పాత్రను ఎత్తిచూపేందుకు కేరళలోని మలప్పురం జిల్లాలో DYFI సభ్యులు ఈ వీధి నాటకాన్ని ప్రదర్శించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ‘CPIM Cyber Commune’ అనే ఫేస్బుక్ పేజీ 09 సెప్టెంబర్ 2017 న షేర్ చేసినట్టు గుర్తించాము. అలాగే ఇదే వీడియో యొక్క అధిక నిడివి గల వీడియోను ‘Dyfi Kalikavu MC’ అనే ఫేస్బుక్ పేజీ 08 సెప్టెంబర్ 2017 న షేర్ చేసినట్టు గుర్తించాము. ఈ వీడియోల యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలో RSS ప్రమేయాన్ని చిత్రీకరించడానికి ఉద్దేశించిన వీధి నాటకానికి (street play) సంబంధించినవి అని తెలుస్తోంది .

ఈ వీడియో ఇదే క్లెయిమ్ తో 2017లో వైరల్ కాగా ఈ వీడియో క్లిప్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యను చిత్రీకరించే వీధి నాటకంలో భాగమని తెలుపుతూ పలు వార్త సంస్థలు కథనాలు పబ్లిష్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). 05 సెప్టెంబర్ 2017న బెంగళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా మరియు ఈ హత్యలోRSS పాత్రను ఎత్తిచూపుతూ కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలో DYFI (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ప్రదర్శించిన వీధి నాటకంలో భాగమని ఈ రిపోర్ట్స్ పేర్కొన్నాయి.  దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు నిజమైన హత్యను చూపించడం లేదని, ఈ వీడియోలోని దృశ్యాలు కేరళలో ప్రదర్శించిన ఒక విధి నాటకానికి(street play) సంబంధించినవిగా మనం నిర్థారించవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం, 05 సెప్టెంబర్ 2017న బెంగళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలో కొందరు అతివాదులు పాత్ర ఉంది.

చివరగా, కేరళలో RSS మద్దతుదారుని ముస్లింలు హత్య చేశారంటూ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా 2017లో కేరళలో ప్రదర్శించిన ఒక వీధి నాటకానికి సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll