ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో యాత్రికులు కాలినడకన ప్రయాణించకూడదు అని అక్కడి ముస్లిం మ్యూల్, గుర్రాల నిర్వాహకులు హిందూ యాత్రికులపై దాడి చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేదార్‌నాథ్‌లో హిందూ యాత్రికులపై అక్కడి ముస్లిం గాడిదల, గుర్రాల నిర్వాహకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో జూన్ 2023లో కేదార్‌నాథ్‌లో యాత్రికులపై మ్యూల్, గుర్రాల నిర్వాహకులు దాడి చేసిన దృశ్యాలను చూపిస్తున్నది. ఈ ఘటనలో నిందితులు ముస్లింలు కాదు. వివిధ వార్తా కథనాల మరియు పోలీసుల ప్రకారం, ఈ ఘటన 11 జూన్ 2023న కేదార్‌నాథ్ యాత్ర నడకమార్గంలోని భీమ్ బాలి వంతెన ప్రాంతంలో కొందరు గుర్రాల నిర్వాహకులు/ఆపరేటర్లు తనుకా పౌండర్ అనే మహిళతో పాటు మరి కొంతమంది యాత్రికులపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు 2023లో రుద్రప్రయాగ్ జిల్లా పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు. వారి పేర్లు అంకిత్ సింగ్, సంతోష్ కుమార్, రోహిత్ కుమార్ మరియు గౌతమ్ అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు, అయితే వారు మైనర్ పేరును వెల్లడించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వైరల్ వీడియోకు చెందిన కీఫ్రేములతో కూడిన వార్తాకథనం ఒకటి 13 జూన్ 2023న ‘దేవభూమి డైలాగ్’ అనే వెబ్‌సైట్ పబ్లిష్ చేసినట్లు తెలిసింది. ఈ కథనం ప్రకారం, ఢిల్లీకి చెందిన తనుకా పౌండర్ అనే మహిళ జూన్ 10న కేదార్‌నాథ్ యాత్రకు గౌరీకుండ్ నుంచి కాలినడకన వెళ్తుండగా, దారిలో భీంబాలి వంతెన దగ్గర ఒక గుర్రం దీన స్థితిలో పడి ఉండటం గమనించి, ఆమె దాని రక్షించడానికి సమీపంలోని వారిని సహాయం కోరింది. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో , ఒక గుర్రపు నిర్వాహకుడు ఒక గుర్రాన్ని విపరీతంగా కొట్టడం చూసి, జంతువుకు హాని చేయవద్దని ఆమె అతనికి చెప్పింది. దీంతో ఆ వ్యక్తి తనుకా పౌండర్ తో వాగ్వాదానికి దిగాడు. వెంటనే, మరి కొంతమంది గుర్రాల నిర్వాహకులు అతనితో చేరి, ఆమె తో దుర్భాషలాడడం మరియు కొట్టడం ప్రారంభించారు. ఆమెను రక్షించడానికి వచ్చిన ఆమె సహచరులను, ఇతర యాత్రికులను కూడా వారు కొట్టారు. ఈ సంఘటన 11 జూన్ 2023న జరిగింది. ఈ విషయమై తనుకా పౌండర్ జూన్ 12న సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సోన్‌ప్రయాగ్ పోలీసులు అంకిత్ సింగ్, సంతోష్ కుమార్, రోహిత్ కుమార్, గౌతమ్ మరియు ఒక మైనర్ బాలుడి పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
ఈ సంఘటనకు సంబంధించి సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్(FIR)ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు 2023లో రుద్రప్రయాగ్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు. అలాగే, మరో ట్వీట్‌లో నిందితుల పేర్లను అంకిత్ సింగ్, సంతోష్ కుమార్, రోహిత్ కుమార్ మరియు గౌతమ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు రుద్రప్రయాగ్ పోలీసులు తెలిపారు, అయితే వారు మైనర్ పేరును వెల్లడించలేదు. 14 జూన్ 2023న రుద్రప్రయాగ్ ఎస్పీ విశాఖ అశోక్ భదానే 11 జూన్ 2023న జరిగిన ఈ సంఘటనను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. దీన్ని బట్టి 2023లో కేదార్‌నాథ్‌లో భీమ్ బాలి వంతెన ప్రాంతంలో యాత్రికులపై దాడి చేసిన గుర్రాల నిర్వాహకులు ముస్లింలు కాదు అని మన నిర్ధారించవచ్చు.
చివరగా, కేదార్‌నాథ్‌లో గుర్రాలు మరియు మ్యూల్స్ నిర్వాహకులు యాత్రికులపై దాడి చేసిన పాత వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.