Fake News, Telugu
 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌‌ పై కోడిగుడ్డు తో దాడి చేసిన ఈ ఘటన 2017 లో జరిగింది

0

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ పై ఒక ముస్లిం నిరసనకారుడు కోడిగుడ్డుతో దాడి చేసిన దృశ్యం, అంటూ షేర్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇస్లాం మతానికి సంబంధించి మాక్రోన్‌ చేసిన వ్యాఖ్యలని నిరసిస్తూ ముస్లిం దేశాలలోని ప్రజలు ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైరల్ అవుతున్న పోస్టులోని ఆ క్లెయిమ్ ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌‌ మాక్రోన్‌ పై ఒక ముస్లిం నిరసనకారుడు ఇటీవల కోడిగుడ్డుతో దాడి చేసిన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ ఘటన 2017లో జరిగింది. ఇమ్మాన్యుయెల్‌‌‌ మాక్రోన్‌  ఫ్రాన్స్ అధ్యక్ష పదవి కోసం పోటిచేస్తున్న సమయంలో పారిస్ నగరంలో జరిగిన అగ్రికల్చర్ ఫెయిర్ ని సందర్షించినప్పుడు ఈ ఘటన జరిగింది. వీడియోలోని ఈ ఘటనకి ఇటీవల ముస్లిం దేశాలు ఫ్రాన్స్ కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి  ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘Express’ న్యూస్ వెబ్ సైట్ ‘01 మార్చ్ 2017’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఫ్రాన్స్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఇమ్మాన్యుయెల్‌‌‌‌ మాక్రోన్‌, పారిస్ నగరంలో జరిగిన అగ్రికల్చర్ ఫెయిర్ ని సందర్షించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. ‘Salon International de l’Agriculture 2017’ అనే అగ్రికల్చర్ ఫెయిర్ కార్యక్రమానికి వచ్చిన ఇమ్మాన్యుయెల్‌‌‌ మాక్రోన్‌ పై ఒక నిరసన కారుడు కోడి గుడ్డు విసిరినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలని చూపుతూ ‘RUPTLY’ న్యూస్ ఛానల్ ‘01 మార్చ్ 2017’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో దొరికింది. ‘Macron egged during visit to Agriculture Fair’ అనే టైటిల్ తో ఈ వీడియో ని ‘RUPTLY’ న్యూస్ ఛానల్ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఫ్రాన్స్ అధ్యక్ష పదవి పోటిదారులలో ఒకరైన ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ పారిస్ లోని  అగ్రికల్చర్ ఫెయిర్ ని సందర్షించినప్పుడు ఒక నిరసనకారుడు మాక్రోన్‌ పై కోడిగుడ్డుతో దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది అని చెప్పవచ్చు.

ముస్లింల పవిత్ర మొహమ్మద్ ప్రవక్త పై చేసిన కార్టూన్ బొమ్మలని క్లాసులో చూపించారనే కారణంతో ఒక సోషల్ టీచర్ ని ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవలే హత్య చేసాడు. ఈ నెల మొదట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ మాట్లాడుతూ, ‘ఇస్లాం మతం సంక్షోబంలో ఉంది, తాము కార్టూన్లు పబ్లిష్ చేసే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.’,అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ముస్లిం దేశాలలో ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా భారి ఉద్యమాలు మొదలయ్యాయి.

చివరగా, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయెల్‌‌ మాక్రోన్‌ పై కోడిగుడ్డు తో దాడి చేసిన ఈ వీడియో పాతది.

Share.

About Author

Comments are closed.

scroll