Fake News, Telugu
 

జితేంద్ర అవద్‌పై గతంలో జరిగిన దాడి దృశ్యాలను తను ఇటీవల రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ ఇటీవల శ్రీరాముడు మాంసాహారి అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి అంటూ పలు వార్తసంస్థలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే జితేంద్ర అవద్‌పై శివ్‌ప్రతిష్ఠాన్ కార్యకర్తలు దాడి చేసారు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్‌పై శివ్‌ప్రతిష్ఠాన్ కార్యకర్తలు దాడి చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత జితేంద్ర అవద్‌పై దాడి జరిగినట్టు ఎలాంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న దాడి దృశ్యాలు గతంలో బాబాసాహెబ్ పురందరే గురించి జితేంద్ర అవద్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన దాడికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

శ్రీరాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎన్సీపీ నేత జితేంద్ర అవద్‌పై ఏమైనా దాడి జరిగిందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఎలాంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ ఆయన పై దాడి జరిగి ఉంటే మీడియా రిపోర్ట్స్ లభించేవి. ఈ క్రమంలోనే జితేంద్ర అవద్‌పై మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయినట్టు పలు వార్తసంస్థల రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ & ఇక్కడ).

తదనంతరం, యూట్యూబ్‌లో జితేంద్ర అవద్‌ దాడికి గురైన వీడియోల కోసం సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కొన్ని దృశ్యాలు కలిగిన వీడియోతో కూడిన వార్తాకథనం ఇండియాటీవీ 20 జూలై 2015న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ కథనం ప్రకారం “మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన కార్యక్రమంలో, ప్రముఖ భారతీయ రచయిత మరియు చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే గురించి జితేంద్ర అవద్‌ అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడు మరియు ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును బాబాసాహెబ్ పురందరేకు ఇవొద్దు అంటూ డిమాండ్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన కొందరు శివప్రతిష్ఠాన్ సంఘటన్ సభ్యులు జితేంద్ర అవద్‌ను కొట్టడానికి వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత వారికి, అవద్‌ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది”.

అంతే కాకుండా ఇదే సంఘటన సంబంధిచిన మరిన్ని వార్తాకథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వైరల్ వీడియో చివర్లో తడి చొక్కాతో నడుస్తున్న అవద్‌ని చూపుతున్న ఫ్రేముల స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 27 నవంబర్ 2023న అవద్ స్వంత యూట్యూబ్ ఖాతాలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఇది కూడా అతని ఇటీవలి వివాదాస్పద ప్రకటన కంటే ముందే జరిగింది. దీన్ని బట్టి గతంలో జితేంద్ర అవద్‌పై జరిగిన దాడి దృశ్యాలను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు అని అర్థమవుతుంది.

చివరగా, శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత జితేంద్ర అవద్‌పై ఎలాంటి దాడి జరగలేదు, గతంలో జరిగిన దాడి దృశ్యాలను ప్రస్తుత పరిస్థితులకు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll