ఒక విమానంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ తన్నుకుంటున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ ప్రయాణికుడిపై దాడి చేస్తున్న వీడియో అని క్లెయిమ్ చేస్తూ కొంత మంది షేర్ చేస్తున్నారు. “విమానంలో 5 మంది ముస్లింలు ఉన్నారు మిగిలినవాళ్లు ఎక్కువగా హిందువులు మరియు వేరే మతస్తులు. ఒక ముస్లిం హిందువుతో గొడవపడి కొడుతుంటే మిగిలిన ముస్లింలు కూడా వచ్చి కొడుతున్నారు, కానీ హిందువులు ఎవ్వరు హిందువుకు అండగా నిలబడలేదు…” అని క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: విమానంలో జరిగిన ఒక గొడవ నేపథ్యంలో ఒక ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ సంఘటన 26 డిసెంబర్ 2022న బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు వెళ్లే థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో జరిగింది. వార్తా కథనాలు, పోలీసుల FIR ప్రకారం, గొడవ పడ్డ ఇద్దరు వ్యక్తులూ ముస్లింలు. వీరి పేర్లు అమిద్ మొహమ్మద్ హుస్సేన్, S.K. అజారుద్దీన్. హుస్సేన్ విమానం యొక్క భద్రతా సూచనలను పాటించడానికి నిరాకరించడంతో ఈ ఘర్షణ జరిగింది. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను ధృవీకరించడానికి, మేము Googleలో ఒక కీ వర్డ్ సెర్చ్ నిర్వహించాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో గురించి జీ న్యూస్ వారు పబ్లిష్ చేసిన ఒక వార్తా కథనం, ‘X’ పోస్ట్ మాకు లభించాయి. దీని ప్రకారం బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ గొడవ జరిగింది.
ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో మరో కీ వర్డ్ సెర్చ్ చేయగా, మాకు మరిన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 26 డిసెంబర్ 2022న బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో జరిగింది. 37Cలో కూర్చున్న అమిద్ మొహమ్మద్ హుస్సేన్ వెన్నునొప్పి కారణంగా తన సీటును సరిచేయడం, సీట్‌బెల్ట్ ధరించడం వంటి ప్రామాణిక భద్రతా సూచనలను పాటించడానికి నిరాకరించాడు.
సిబ్బంది పదేపదే అడిగినప్పటికీ, అతను సహకరించలేదు. అందుకని, విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు S.K. అజారుద్దీన్ ఆందోళన చెంది హుస్సేన్‌తో గొడవ పడి కొట్టాడు. ఆ తర్వాత అనేక మంది ఇతర ప్రయాణికులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు.

ఈ గొడవలో పాల్గొన్న ప్రయాణికులందరిపై సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వారు ఒక పోలీస్ కంప్లైంట్ (ఫిర్యాదు) దాఖలు చేశారు అని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అలాగే, ఈ సంఘటన వెనుక మతపరమైన ఉద్దేశ్యం ఉన్నట్లు మీడియా కథనాల్లో ప్రస్తావించబడలేదు.
థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ ఈ సంఘటనను ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి రిపోర్ట్ చేసింది. 37C సీటులో ఉన్న ప్రయాణీకుడు అమిద్ మొహమ్మద్ హుస్సేన్ భద్రతా నియమాలను పాటించడానికి నిరాకరించాడని, ఇది విమానంలో ఘర్షణకు కారణమైందని ఎయిర్‌లైన్ చెప్పింది.
సంఘటనలో పాల్గొన్న వ్యక్తుల గుర్తింపులను నిర్ధారించడానికి, మేము కోల్‌కతాలోని బిధాన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేయబడ్డ FIRని పరిశీలించాము. 37C సీటులో ఉన్న వ్యక్తి పేరు అహ్మద్/మహమ్మద్ హుస్సేన్ అని, 41C సీటులో ఉన్న వ్యక్తి పేరు షేక్ అజారుద్దీన్ అని ఇందులో పోలీస్ వారు పేర్కొన్నారు. దీన్ని బట్టి వారిద్దరూ ఒకే మతానికి చెందిన వారు అని మనకి స్పష్టం అవుతుంది.

చివరగా, థాయ్‌లాండ్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న ఒక విమానంలో, డిసెంబర్ 2022లో జరిగిన ఒక ఘర్షణ యొక్క పాత వీడియోని తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.