Fake News, Telugu
 

ఆమ్ ఆద్మీ పార్టీ 2018 ర్యాలీ వీడియోని ఢిల్లీలో రైతులుగా మారిన అడ్డా కూలీలని షేర్ చేస్తున్నారు

0

అడ్డా కూలీలకు డబ్బులిచ్చి ఢిల్లీ లో రైతు ఉద్యమాలు చేయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూలీలకు రావలిసిన డబ్బులు ఇవ్వకుండా విసిగించడంతో, వాళ్ళు ఇలా తమ ఆగ్రహాన్ని తెలుపుతున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అడ్డా కూలీలకు డబ్బులిచ్చి ఢిల్లీ లో రైతు ఉద్యమాలు చేయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2018లో ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానలో నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్న కూలీలు, తమకు రావలిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇలా తమ అసహనం వ్యక్తపరిచారు. ఈ వీడియోకి ఇటివల రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ఒక యూసర్ 2018లో తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. హర్యానా లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్న అడ్డా కూలీలు, తమకు రావలిసిన డబ్బుల కొరకు నిరసన చేస్తున్న వీడియో ఇది అని అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ‘Inkhabar’ న్యూస్ వెబ్ సైట్ ‘26 మార్చ్ 2018’ నాడు ఆర్టికల్ దొరికింది. 2018లో ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా లో నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొనటానికి ఒక్కో కూలీకి 350 రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఆ కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఇలా అసహనం తెలిపినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

కూలీలు చేసిన ఈ నిరసనకు సంబంధించి ‘ The Times of India’ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం మెంబెర్ ఈ వీడియోని ఇంకో వీడియోతో కలిపి షేర్ చేస్తూ అతన్ని కావాలని అబద్ధం ఆడేలా చేసారంటూ పేర్కొన్నారు. ఈ ఆరోపణలలో ఎంత నిజం ఉందొ తెలియనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో ఇటీవల రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2018 లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీకి సంబంధించిన వీడియోని చూపిస్తూ అడ్డా కూలీలకు డబ్బులిచ్చి ఢిల్లీ లో రైతు ఉద్యమాలు చేయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll