‘బెంగాల్‌లో హిజాబ్‌కి మద్దతుగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారంటూ’ పోలీసులు నిరసనకారులను చెదరగొడుతున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ నిరసనకారులలో బుర్ఖా ధరించిన యువతులు కూడా ఉన్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్‌లో హిజాబ్‌కి మద్ధతుగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీఛార్జ్ చేసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో గత సెప్టెంబర్‌లో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటనకు సంబంధించింది. కర్ణాటక ముస్లిం యువతకు మద్దతు తెలుపుతూ బెంగాల్‌లో నిరసన కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఈ వీడియోతో బెంగాల్‌కి గానీ లేదా ప్రస్తుతం జరుగుతున్న హిజాబ్ నిరసనలకు గాని ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకి, పశ్చిమ బెంగాల్‌కి గానీ లేదా ప్రస్తుతం జరుగుతున్న హిజాబ్ నిరసనలకు గాని ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో గత సెప్టెంబర్‌లో (2021) జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటనకు సంబంధించింది.
వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా గత సెప్టెంబర్‌లో ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన ఒక ఆన్లైన్ న్యూస్ రిపోర్ట్ ఒకటి మాకు కనిపించింది. ఈ వీడియోకి సంబంధించిన వివరణ ప్రకారం వీడియోలోని దృశ్యాలు బెంగళూరులో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నిరసనలకు సంబంధించినవిగా అర్ధమవుతుంది.
పైన తెలిపిన న్యూస్ రిపోర్ట్ ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా సెప్టెంబర్ 2021లో బెంగళూరులో జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం నిరసన చేస్తున్న విద్యార్థులు అసెంబ్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో వారిపై లాఠీఛార్జ్ చేసారు. ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని న్యూస్ రిపోర్ట్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇదిలా ఉండగా, కర్ణాటకలో హిజాబ్ వివాదం నెలకొన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలలో విద్యార్థులు కర్ణాటక ముస్లిం యువతకు మద్దతు తెలుపుతూ నిరసనలు చేపట్టారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో హిజాబ్ ధరించినందుకు విద్యార్థినిలను స్కూల్‌లోకి అనుమతించకపోవడంతో స్థానికులు స్కూల్‌పై దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఐతే వైరల్ అయిన వీడియోకి బెంగాల్‌లో జరిగిన నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, కర్ణాటకలో విద్యార్థులపై గతంలో జరిగిన లాఠీఛార్జ్ వీడియోని బెంగాల్‌లో హిజాబ్‌కి మద్ధతుగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసుల లాఠీఛార్జ్ అంటూ షేర్ చేస్తున్నారు.