“పంజాబ్ రాష్ట్రంలో కనీస మద్దతు ధర తో కొనుక్కున్న గోధుమలు మీద నీళ్లు పోస్తున్న దృశ్యం. అవి కుళ్లిపోతే వాటిని బడా కార్పొరేట్ బీరు కంపనీలకు అమ్మేస్తారు…నూతన వ్యవసాయ చట్టాలు వలన ఇలాంటి దొంగ నాటకాలు ఇంక కుదరవు, అందుకేనేమో కోట్లు ఖర్చు చేసి ఉద్యమాలు చేస్తున్నారు ఢిల్లీలో!”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఢిల్లీ లో రైతుల నిరసన సందర్భంగా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గోధుమలను కుళ్లిపోయేలా చేసి బీరు కంపనీలకు అమ్మడానికి పంజాబ్ రాష్ట్రంలో కనీస మద్దతు ధర తో కొన్న గోధుమల మీద నీళ్లు పోస్తున్న దృశ్యం.
ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియో హర్యానా రాష్ట్రానికి సంబంధించింది; పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. గోధుమ బ్యాగ్‌ల బరువు పెంచడానికి వీడియోలోని వ్యక్తి నీళ్లు పోసాడని 2018 లో వివిధ వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియో పై వివిధ వార్తాసంస్థలు 2018 లో ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ వీడియో హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ మండి లో తీసిందని, గోధుమ బ్యాగ్‌ల బరువు పెంచడానికి వీడియోలోని వ్యక్తి నీళ్లు పోసాడని ‘Jagran’ ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ గోదుమలు ఐఎన్ఎల్డీ లీడర్ కుల్జీత్ కుల్డియా కి చెందిన షాప్ వి అని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ అధికారులు తెలిపినట్టు వార్తాసంస్థలు 2018 లో రిపోర్ట్ చేసాయి.

ఒకటి రెండు వారలు గోధుమలు అమ్మకపోతే, వాటిలోని తేమ తగ్గి బరువు తగ్గుతుందని, ఆ నష్టాన్ని పూడ్చడానికి అలా గోధుమ బ్యాగ్‌ల పై నీళ్లు చల్లుతారని ఒక వ్యాపారి తెలిపినట్టు ‘Jagran’ ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే, అలా చేయడం వల్ల వ్యాపారికి లాభం వచ్చినా, కొనే వారికి నష్టం కలుగుతుందని తెలిసింది. పోస్ట్ లోని వీడియోకి సంబంధించి వేరే వార్తాసంస్థలు పెట్టిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, గోధుమలు కుళ్లిపోవాడానికి కాదు, గోధుమ బ్యాగ్‌ల బరువు పెంచడానికి వీడియోలోని వ్యక్తి నీళ్లు పోస్తున్నాడు.