ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, “హిందువుల హత్యకు నిరసనగా బంగ్లాదేశ్‌లో నాగ సాధువులు నిరసన చేపట్టారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో వందలాది మంది నాగసాధువులు కలిసి ర్యాలీగా వెళ్లడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందువుల హత్యకు నిరసనగా బంగ్లాదేశ్‌లో నాగ సాధువులు నిరసన చేపట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు మార్చి 2021లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన మహాకుంభ మేళాకు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).
పలు రిపోర్ట్స్ ప్రకారం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 05 ఆగస్టు 2024న రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినప్పటి నుండి మైనారిటీలను, ముఖ్యంగా హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొన్ని జరిగిన హింసకు వ్యతిరేకంగా 09 ఆగస్టు 2024న వందలాది మంది హిందూ ప్రజలు బంగ్లాదేశ్ రాజధాని మరియు బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో నిరసన తెలిపారు (ఇక్కడ , ఇక్కడ , & ఇక్కడ).
ఇకపోతే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను ‘నవీన్ బింజొలా(Naveen binjola)’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మేము కనుగొన్నాము. ఈ వీడియో 13 మార్చి 2021న అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు మార్చి 2021లో హరిద్వార్‌లో జరిగిన మహాకుంభ మేళాకు సంబంధించినవిగా తెలుస్తుంది. ఈ యూట్యూబ్ వీడియోలో వైరల్ వీడియో కన్నా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైరల్ వీడియోలోని దృశ్యాలనే మరో కోణంలో చూపిస్తున్న మరిన్ని వీడియోలు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోల వివరణలో కూడా ఈ వీడియో మార్చి 2021లో హరిద్వార్‌లో జరిగిన మహాకుంభ మేళాకు సంబంధించినవిగా పేర్కొన్నారు.
ఈ వీడియోలో ‘గోపాల్ రేడియోస్ (GOPAL RADIOS), ఈశ్వర్ ఖాదీ కంబల్ భండార్’ అని దుకాణాలుపై ఉన్న పేర్లు మనం గమనించవచ్చు. వీటి ఆధారంగా మేము గూగుల్ మ్యాప్స్‌లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న ఈ దుకాణాలను జియోలొకేట్ చేశాము. వైరల్ వీడియోలోని దృశ్యాలను, జ్వాలాపూర్ రైల్వే స్టేషన్ రోడ్, బిర్లా ఘాట్, హరిద్వార్, ఉత్తరాఖండ్ గూగుల్ స్ట్రీట్ వ్యూతో పోల్చి చూస్తే, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు మార్చి 2021లో హరిద్వార్‌లో జరిగిన మహాకుంభ మేళాకు సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.
హరిద్వార్‌లో హిందూ సాధువులు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారని, అలాగే అవసరమైతే బంగ్లాదేశ్ పైకి దండయాత్ర చేసేందుకు సాధువుల సంఘం సిద్ధంగా ఉందని ఈ నిరసనలో సాధువులు తెలిపినట్లు పలు రిపోర్ట్స్ పేర్కున్నాయి (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2021లో హరిద్వార్‌లో జరిగిన మహాకుంభ మేళాకు సంబంధించినవి.