‘తాజాగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ చేయమని, తీవ్రవాద నిరోధక చట్టం UAPA ను రద్దు చేయమని బ్యానర్ లను ప్రదర్శించారు. కాశ్మీర్ ఆర్టికల్ 370కి, UAPA చట్టానికి రైతు సమస్యలకు ఉన్న లింక్ ఏమిటి..?’, అని అడుగుతూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాజా నిరసనల్లో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ చేయమని, తీవ్రవాద నిరోధక చట్టం UAPA ను రద్దు చేయమని కోరుతూ బ్యానర్ లను ప్రదర్శిస్తున్న రైతుల ఫోటోలు.
ఫాక్ట్: పోస్ట్ లోని రెండు ఫోటోలు రైతుల తాజా నిరసనలకి సంబంధించినవి కావు. రెండు ఫోటోలు గత సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని మొదటి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో కూడిన ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ని సెప్టెంబర్ 2019 లోనే ప్రచురించినట్టు చూడవొచ్చు. ‘ది ట్రిబ్యూన్’ వారు సెప్టెంబర్ 2019 లో ప్రచురించిన ఆర్టికల్ లో అదే బ్యానర్ ని చూడవొచ్చు. కావున, ఫోటో పాతది; తాజా రైతు నిరసనలకి సంబంధించిన ఫోటో కాదు.
పోస్ట్ లోని మరో ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో కొన్ని కీ-వర్డ్స్ సహాయంతో వెతకగా, ఆ ఫోటోని ‘Shiromani Akali Dal Amritsar’ అనే ఫేస్బుక్ పేజీ ఆగష్టు 2019 లోనే పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి, ఈ ఫోటో కూడా తాజా రైతు నిరసనలకి సంబంధించింది కాదు.
చివరగా, 2019లో ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ కోరుతున్న నిరసనలకి సంబంధించిన ఫోటోలను, రైతుల తాజా నిరసనలకి ముడి పెడుతున్నారు..