Fake News, Telugu
 

పాత ఫోటోలని చూపిస్తూ కరోనా టైంలో మోదీ ప్రచారం కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

0

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ పబ్లిసిటీ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడని చెప్తూ ఉన్న పోస్టు (ఆర్కైవ్డ్) ఒకటి వైరల్ అవుతుంది. ఇలాంటి క్లెయిమ్ తోనే ఉన్న మరికొన్ని పోస్టులు ఇక్కడ (ఆర్కైవ్డ్) మరియు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడొచ్చు.  ఈ ఫోటో షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ఈ పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ పోస్టుల్లో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ పబ్లిసిటీ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడు

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న కొన్ని ఫోటోలు మోదీ తన వెబ్సైటు లో 2011లో తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షేర్ చేసాడు. మిగతా ఫోటోలు కూడా ఇంచుమించు అప్పటి నుంచే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీన్నిబట్టి ఈ ఫోటోలు పాతవని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫోటో 1:

చెట్టు కింద పేపర్ చదువుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2013 ఈ ఫోటోని ప్రచురించిన ఒక లిస్టికిల్ మాకు కనిపించింది. ఈ లిస్టికిల్ 14 సెప్టెంబర్ 2013న ప్రచురించబడింది. ఈ ఫోటో కింద ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఫోటో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంధీనగర్ లోని తన నివాసంలో తీసింది. దీన్నిబట్టి ఈ ఫోటో చాలా పాతదని చెప్పొచ్చు.

ఫోటో 2:

‘Narendra Modi Ducks’ అనే కీవర్డ్స్ తో గూగుల్ లో సెర్చ్ చేయగా ఈ ఫొటోస్ నరేంద్ర మోదీ అధికారిక వెబ్సైటులో దొరికాయి. ఈ వెబ్సైటు లో ‘With my Friends’ అన్న వివరణతో ఈ ఫొటోస్ ని షేర్ చేసారు. ఐతే  ఈ ఫొటోస్ షేర్ చేసిన తేది 10 మే 2011గా ఉంది. దీన్నిబట్టి ఈ ఫొటో పాతదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఫోటో 3:

ఈ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఫోటో కూడా పైన ఫోటో తీసిన సమయంలో తీసిందని చెప్పడానికి కొన్ని ఆధారాలు మాకు దొరికాయి. పై ఫోటోలో, ఈ ఫోటోలో మోదీ వేసుకున్న దుస్తులు ఒకేలా ఉన్నాయి. ఇంకా రెండు ఫోటోల్లో మోదీ వెనకాల ఉన్న చెట్లు మొదలైన బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉన్నాయి. దీన్నిబట్టి ఈ ఫోటోకూడా 2011వ సంవత్సరానికి సంబంధించిందని చెప్పొచ్చు.

ఫోటో 4:

ఈ ఫోటోకి సంబంధించి ఒరిజినల్ సోర్స్ దొరకలేదు. కాని ప్రోఫ్ఫెస్సోర్ నాలపాట్ తను మోదీని 2012లో ఇంటర్వ్యూ చేసిన సంధర్బంలో జరిగిన సంభాషణ గురించి తన బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించాడు. ఇదే ఆర్టికల్ లో కొన్ని మోదీ ఫోటోలని కూడా తాను ప్రచురించాడు. ఈ ఆర్టికల్ లో ప్రచురించిన ఒక ఫోటోలో మోదీ ధరించిన దుస్తులు, పోస్టులో మోదీ ధరించిన దుస్తులు ఒకేలా ఉన్నాయి. దీన్నిబట్టి పోస్టులో ఉన్న ఈ ఫోటో కూడా పాతదని చెప్పొచ్చు.

ఇటీవలే నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా నెమలులతో తాను కనిపించే వీడియో ఒకటి షేర్ చేసిన నేపథ్యంలో పోస్టులో ఉన్న ఫోటోలు తప్పుడు క్లెయిమ్స్ తో వైరల్ అవుతున్నాయి.

చివరగా, పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోలు మోదీ కరోనా టైం నిర్వహించిన ఫోటో షూట్ కి సంబంధించినవి కావు.

Share.

About Author

Comments are closed.

scroll