Fake News, Telugu
 

నరేంద్రమోదీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టడానికి ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌ ఉపయోగించారని పాత ఫోటోలను షేర్ చేస్తున్నారు

0

“అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం ప్రపంచంలో అతి పెద్దది, కానీ వర్షం పడితే ఆటోమేటిక్ డ్రయింగ్ మెషిన్స్ లేవు, బట్టలతో తూడుస్తున్నారు, ఇస్తిరిపెట్టేతో ఆరపెడుతునారు” అంటూ క్రికెట్ పిచ్‌ను ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌తో ఆరబెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలోని పిచ్‌ను ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌తో ఆరబెడుతున్న ఫోటోలు.

ఫాక్ట్(నిజం):  నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో తడిచిన పిచ్‌ను ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌తో ఆరబెట్టారంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటోలు జనవరి 2020లో గౌహతిలో ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించినవని. మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో పిచ్‌ను ఆరబెట్టడానికి స్పాంజ్‌లను ఉపయోగించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 2023 IPL ఫైనల్ జరిగింది. మ్యాచ్‌ మధ్యలో వర్షం పడడంతో ఓవర్‌లను కుదించారు. ఐతే ఈ నేపథ్యంలోనే వర్షంతో తడిచిన పిచ్‌ను ఇస్త్రీ పెట్టెతో, డ్రైయర్‌తో ఆరబెట్టారంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కాని నిజానికి ఈ ఫోటోలు ఇటీవల మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌కు సంబంధించినవి కావు.

వైరల్ అవుతున్న ఈ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోలను జనవరి 2020లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటోలు ఇండియా-శ్రీలంక మధ్య గౌహతిలో జరగాల్సిన T20 మ్యాచ్‌కు సంబంధించినవని తెలిసింది.

ఆ మ్యాచ్ సమయంలో వర్షం పడడంతో స్టేడియం సిబ్బంది పిచ్‌ను ఇలా ఇస్త్రీ పెట్టెతో, డ్రైయర్‌తో ఆరబెట్టె ప్రయత్నం చేసారు. అప్పట్లో ఇలా చేసినందుకు BCCI విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవల మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో వర్షం వల్ల తడిచిన పిచ్‌ను స్పాంజ్‌లు ఉపయోగించి ఆరబెట్టారని కొన్ని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). అలాగే వీటికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా ప్రచురించాయి. వైరల్ పోస్టులో షేర్ చేసిన ఇతర ఫోటోలు, ఈ కథనాలలో షేర్ చేసిన ఫోటోలు ఒక్కటే. కాగా కొన్ని వార్తా కథనాలు ఇస్త్రీ పెట్టెతో, డ్రైయర్‌లు ఉపయోగించినట్టు రాసుకొచ్చాయి కాని ఈ కథనాలు మాత్రం పైన తెలిపిన పాత ఫోటోలనే షేర్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, నరేంద్రమోదీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టడానికి ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌ ఉపయోగించారని పాత ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll