హిజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ముస్లిం విద్యార్ధులకు తన మద్దతు తెలుపుతూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఒకప్పుడు బురఖాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాఖీ సావంత్, ఈ రోజు హిజాబ్‌కు మద్దతుగా నిలుస్తుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ముస్లిం విద్యార్ధులకు తన మద్దతు తెలుపుతూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోలు పాతవి. 2021 ఆగష్టు నెలలో రాఖీ సావంత్ హిజాబ్ ధరించుకొని జిమ్ సెంటరుకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలని తీసారు. ఈ ఫోటోలకి ప్రస్తుత హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, రాఖీ సావంత్ హిజాబ్ వస్త్రాలతో ఉన్న ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తా సంస్థ 31 ఆగష్టు 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించి జిమ్ సెంటరుకి వెళ్తున్న దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు.
రాఖీ సావంత్ హిజాబ్ ధరించి జిమ్ సెంటరుకు వెళ్ళిన వీడియోలని పలు వార్తా సంస్థలు, వినోద వార్తలు ప్రసారం చేసే సంస్థలు తమ యూట్యూబ్ ఛానెల్స్‌లలో పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. తను ధరించిన హిజాబ్ వస్త్రాన్ని ఒక స్నేహితురాలు కానుకగా ఇచ్చారని, హిజాబ్ లోపల జిమ్ వస్త్రాలు ఉన్నాయని రాఖీ సావంత్ అప్పుడు మీడియాకు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన రాఖీ సావంత్ ఫోటోలు పాతవి అలాగే, ప్రస్తుత హిజాబ్ వివాదానికి సంబంధించినవి కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, రాఖీ సావంత్ హిజాబ్ ధరించి జిమ్ సెంటరుకి వెళ్తున్న పాత ఫొటోలని కర్ణాటక హిజాబ్ వివాదానికి జత చేస్తున్నారు.