22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. పాకిస్తాన్ దళాలు జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రదేశాలలో కాల్పులు జరిపినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను ప్రారంభించింది, ఈ ఆపరేషన్లలో భాగంగా కుల్గాం మరియు బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 25 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌ను సందర్శించారు .
ఈ నేపథ్యంలో, “పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను సంబంధించిన దృశ్యాలు” అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ వీడియోలు ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లలకు సంబంధించినవా? లేదా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను సంబంధించినవి కావు, ఇవి 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
Update (01 May 2025):
వీడియో-9:
సియాల్‌కోట్ సమీపంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ యొక్క ఎఫ్-16ను కూల్చివేసిందని క్లెయిమ్ చేస్తూ, ఒక వీడియోని (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు.

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఉన్న 4 జూన్ 2024 నాటి ఒక ఫేస్‌బుక్ పోస్ట్ (ఆర్కైవ్ లింక్) దొరికింది. దీనిబట్టి, ఈ వీడియోకి 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం అవుతుంది. ఈ పోస్టు యొక్క వివరణ ప్రకారం వీడియోలో కనిపిస్తున్న సంఘటన నాసిక్‌లోని, నిఫాద్ తాలుకాలో ఉన్న షిరాస్‌గావ్‌లో జరిగింది. ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో భారతీయ వాయుసేన యొక్క Su-30 MKI ఫైటర్ విమానం కూలిపోయిన సంఘటనకు చెందిన దృశ్యాలు ఇవి అని ఈ పోస్ట్ యొక్క వివరణలో ఉంది.
ఈ వివరణ ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, వైరల్ వీడియో యొక్క మరో వెర్షన్ మాకు ‘Lokmat Times’ వారి ‘X’లో దొరికింది.
ఈ వీడియోను వాళ్లు 4 జూన్ 2024న అప్లోడ్ చేశారు. ఈ వీడియో నాసిక్‌లోని, నిఫాద్ తాలుకాలో ఉన్న షిరాజ్‌గావ్‌లో Sukhoi 30 ఫైటర్ విమానం కూలిపోయిన దృశ్యాలను చూపిస్తుందని ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్‌లు సమయానికి పేరాషూట్‌ల సహాయంతో తప్పించుకున్నారని ‘Lokmat Times’ తమ పోస్ట్ యొక్క వివరణలో పేర్కొన్నారు.
ఈ సంఘటనపై ప్రచురితమైన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వీడియో-10:
కొన్ని భారీ భవనాలు, శిథిలావస్థలో కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. ఈ వీడియోని ‘ఇండియాతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది మరి’ అని అంటూ, పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోలో dn_osama అనే వాటర్‌మార్క్ ఉండటాన్ని గమనించి, దాని గురించి ఇంటర్నెట్లో వెతుకగా, ఈ పేరుతో ఉన్న ఒక వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించింది. 19 జనవరి 2025న ఇదే వీడియోను (ఆర్కైవ్డ్) ఈ అకౌంటులో అప్లోడ్ చేశారు. దీనిబట్టి, ఈ వీడియోకి 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి సంబంధం లేదని అర్థం అవుతుంది.
ఈ పోస్టు యొక్క వివరణలో, ఈ వీడియో ఉత్తర గాజాలోని జబాలియా క్యాంప్‌లో జరిగిన భారీ విధ్వంసాన్ని చూపిస్తుందని ఉంది. Osama తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క బయోలో తను ఉత్తర గాజాకు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ అని పేర్కొన్నారు.

ఈయన అకౌంటులో, ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని చూపుతున్న చాలా వీడియోలు, ఫోటోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
వైరల్ వీడియో ఎక్కడ చిత్రించారు అని కచ్చితంగా తెలియనప్పటికీ, ఈ వీడియో 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది కాబట్టి, వైరల్ వీడియోకి పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన చర్యలకు ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించవచ్చు.
Update (30 April 2025):
వీడియో-8:
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న లీపా వ్యాలీలోని పాకిస్థాన్ మందుగుండు గోడౌన్‌ను భారత ఆర్మీ పేల్చేసిందంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉంది.

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని 20 మార్చి 2022లోనే X(ట్విట్టర్)లో పోస్టు (ఆర్కైవ్) చేసినట్లు గుర్తించాం. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ ప్రాంతంలో అనేక పేలుళ్లు జరిగాయని, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదని ఈ పోస్టులో చెప్పబడింది.
ఇక ఈ ఘటన గురించి మరిత సమాచారం గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 20 మార్చి 2022లో ఉత్తర పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లోని ఒక సైనిక స్థావరంలో అనేక పేలుళ్లు సంభవించాయి. అది మందుగుండు సామగ్రి నిల్వ ప్రాంతం అని ప్రాథమికంగా వెల్లడించారు. దీనికి కచ్చితమైన కారణం తెలియలేదంటూ కథనాలు పేర్కొన్నాయి.
Published (26 April 2025):
వీడియో-1:
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్ సైన్యం మీద ప్రతీకార దాడి చేస్తోందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ). తట్టా పానీ సెక్టార్‌లో జరిగిన భారీ షెల్లింగ్‌లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, అనేక పోస్టులు ధ్వంసమయ్యాయని ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియో 2020 నాటిది, ఇది జమ్మూ & కశ్మీర్‌లోని పూంచ్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత సైన్యం ప్రతిస్పందనను చూపిస్తుంది. వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను పలువురు 2020 ఏప్రిల్, మే నెలల్లో ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ & ఇక్కడ).
అలాగే ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను ‘రిపబ్లిక్ భారత్’ మీడియా సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో 14 జూన్ 2020న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత సైన్యం బలమైన ప్రతిస్పందనను ఈ వీడియో చూపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, ఈ వీడియో 2020 నుండి ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
వీడియో-2:
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఒక ఉగ్రవాదిని కాల్చి చంపుతున్న దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). “పహల్గామ్ ప్రతీకారం పూర్తయింది” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో 19 ఆగస్టు 2022న ‘BestGore.fun’ అనే వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. ఈ వెబ్‌సైట్ హింస, రక్తపాతంకు సంబంధించిన వీడియోలను, చిత్రాలు, ఇలాంటి సంఘటనలకు సంబంధించి గ్రాఫిక్ కంటెంట్‌ను హోస్ట్ చేయడానికి ప్రసిద్ధి చెందింది అని మేము గుర్తించాము. అలాగే, 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి కంటే చాలా కాలం ముందు నుండే ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఉందని మేము కనుగొన్నాము.

వైరల్ అవుతున్న వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, ఈ వీడియో 2022 నుండే ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
వీడియో-3:
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో భాగంగా జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్ చేయబడింది) 01 ఏప్రిల్ 2025న ఇన్‌స్టాగ్రామ్ ఓ యూజర్ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో జమ్మూ & కశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను చూపిస్తుందని పోస్టు వివరణంలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు నాటిదని మనం నిర్ధారించవచ్చు.
అయితే మేము ఈ వైరల్ వీడియో ఎప్పడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయాన్ని కచ్చితంగా ధృవీకరించలేము. కానీ ఈ వీడియో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీడియో పహల్గామ్ దాడికి ముందు నుండే ఆన్ లైన్లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
వీడియో-4:
ఓ ఇల్లు తగలబడుతున్న విజువల్స్, కాల్పుల శబ్దం వినిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ఉగ్రవాదుల ఇళ్ళను సైన్యం పేల్చి వేసింది’ అంటూ క్లెయిమ్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ).

అయితే, ఈ వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2021 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను ‘ఎక్సెల్సియర్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ 12 మే 2021న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో జమ్మూ & కశ్మీర్‌లోని కోకర్నాగ్‌లో 2021లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌ను చూపిస్తుంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వార్త కథనాల ప్రకారం, పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ఇద్దరు లష్కరే తోయిబా ఇళ్లలో పేలుళ్లు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ , ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లల్లో సోదాలు జరపడానికి భద్రతా సిబ్బంది వెళ్లగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకున్నారని తెలిపారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.
వీడియో-5:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం క్షిపణితో పాకిస్తాన్‌లోని ఓ నగరంపై దాడి చేసి భవనాన్ని కూల్చివేసిన దృశ్యాలను అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2024 ప్రచురించబడిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వీడియో 22 నవంబర్ 2024న దక్షిణ లెబనాన్, బీరుట్ శివార్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడులను చూపిస్తుంది. దీన్ని బట్టి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.
వీడియో-6:
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం బోర్డర్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై మోర్టార్లను ప్రయోగిస్తున్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, రెండేళ్ల క్రితం ఇదే వీడియోను రెడ్డిట్‌లో పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి చాలా కాలం ముందు ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

వీడియో-7:
“LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు శత్రు సైన్యానికి గట్టిగా బదులిచ్చిన భారత ఆర్మీ నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అందుతున్న సమాచారం” అని క్లెయిమ్ చేస్తూ కొంతమంది భారతీయ సైనికులు ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ).

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,ఇదే వీడియోను కనీసం 2021 నుండి ఆన్‌లైన్‌లో చాలా మంది షేర్ చేస్తున్నారని మేము గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో మేము నిర్ధారించలేకపోయినా వైరల్ వీడియో ఇటీవలిది కాదని మేము నిర్ధారించగలము.

చివరగా, 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సంబంధించిన దృశ్యాలంటూ సంబంధంలేని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.