Fake News, Telugu
 

పాత ‘ABP’ న్యూస్ బులిటెన్‌ని మలేషియా ప్రభుత్వం జాకీర్ నాయక్‌ని అరెస్ట్ చేసి భారత దేశానికి అప్పగిస్తున్నట్టుగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. మలేషియా ప్రభుత్వం జాకీర్ నాయక్‌ని భారతదేశానికి  పంపిస్తున్నట్టుగా రిపోర్ట్ చేసిన ‘ABP’ న్యూస్ బులిటెన్‌ని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం అరెస్ట్ చేసి భారతదేశానికి పంపిస్తుంది.

ఫాక్ట్ (నిజం): మలేషియా ప్రభుత్వం ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని భారత దేశానికి అప్పగిస్తున్నట్టుగా రిపోర్ట్ చేసిన ఈ వీడియోని ‘ABP’ న్యూస్ సంస్థ 04 జూలై 2018 నాడు పబ్లిష్ చేసింది. అయితే, జాకీర్ నాయక్‌ని భారతదేశానికి పంపించబోమని మలేషియా ప్రధాని స్పష్టం చేసినట్టు ‘ABP’ న్యూస్ సంస్థ 06 జూలై 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. జాకీర్ నాయక్‌ని మలేసియా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు ఇటీవల ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల గూగుల్‌లో వెతికితే,  ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు ఇటీవల ఎటువంటి వార్తలు రిపోర్ట్ పబ్లిష్ అవలేదని తెలిసింది. ఒకవేళ మలేషియా ప్రభుత్వం జాకీర్ నాయక్‌ని ఇటీవల అరెస్ట్ చేసి భారతదేశానికి పంపిస్తున్నట్టు ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. జాకీర్ నాయక్‌ని భారతదేశానికి రప్పించడం పై ఇటీవల ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిది అరిందం బాగ్చి సమాధానమిస్తూ, జాకీర్ నాయక్‌ని భారతదేశానికి రప్పించడానికి మలేషియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. జాకీర్ నాయక్‌ని అప్పగించడం పై మలేషియా ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని వారు తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన వీడియో పై ‘Phir Ek Baar Modi Sarkar’ అనే లోగో కనిపిస్తుంది. ఈ వివరాల  ఆధారంగా ఆ వీడియో కోసం వెతికితే, ‘Phir Ek Baar Modi Sarkar’ అనే  ఫేస్బుక్ పేజి ఈ వీడియోని 04 జూలై 2018 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. దీనిబట్టి ఈ వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ వీడియో కోసం ‘ABP’ న్యూస్ సంస్థ అధికారిక సోషల్ మీడియా హేండిల్స్ లో వెతకగా, ఈ వీడియోని ‘ABP’ న్యూస్ సంస్థ 04 జూలై 2018 నాడు తమ ఫేస్బుక్ పేజిలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మలేషియా ప్రభుత్వం జాకీర్ నాయక్‌ని అరెస్ట్ చేసి భారతదేశానికి పంపిస్తున్నట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ABP’ న్యూస్ సంస్థ ట్వీట్ కూడా పెట్టింది.

అయితే, ‘ABP’ న్యూస్ సంస్థ 06 జూలై 2018 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో అప్పటి మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్, జాకీర్ నాయక్‌ను భారతదేశానికి పంపించడానికి అంగికరించలేదని తెలిపారు. తన అరెస్ట్ పై భారతీయ మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని జాకీర్ నాయక్‌ 06 జూలై 2018 నాడు తన ఫేస్బుక్ పేజిలో వీడియో పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టుల్ షేర్ చేసిన వీడియో పాతది అని, జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాత ‘ABP’ న్యూస్ బులిటెన్‌ని చూపిస్తూ ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ని మలేషియా ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll