Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌ కోర్టు వద్ద హత్య చేయబడ్డ ముస్లిం వ్యక్తి చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపు న్యాయవాది కాదు

0

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్‌పై నమోదైన దేశద్రోహం కేసులో స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ఒక ముస్లిం న్యాయవాదిని ముస్లింలు కోర్టు బయట చంపారని చెప్తూ ఒక లాయర్ ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ఒక ముస్లిం న్యాయవాదిని ముస్లింలు చంపారు.

ఫాక్ట్: ఫోటోలోని న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అలీఫ్. చిన్మోయ్ కృష్ణదాస్‌పై నమోదైన దేశద్రోహం కేసులో 26 నవంబర్ 2024న స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో జరిగిన హింసలో సైఫుల్ మృతిచెందారు. ఈ కేసులో కృష్ణదాస్‌ తరపున కానీ, వ్యతిరేకంగా కానీ సైఫుల్ వాదించట్లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ పోస్టులోని లాయర్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ వ్యక్తి పేరు సైఫుల్ ఇస్లాం అలీఫ్ అని తెలిసింది. ఆయన చిట్టగాంగ్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నారు. స్థానిక వార్తా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, 26 నవంబర్ 2024 నాడు ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్‌పై నమోదైన దేశద్రోహం కేసులో స్థానిక చిట్టగాంగ్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో కోర్టు ఆవరణలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో తలకి బలమైన గాయాలు కావడంతో సైఫుల్ ఇస్లాం అలీఫ్ మృతి చెందారు.

అయితే, దేశద్రోహం కేసులో కృష్ణదాస్ తరపున శుభాశిష్ శర్మ, స్వరూప్ కాంతి నాథ్ తదితర న్యాయవాదుల బృందం వాదిస్తున్నట్లు స్థానిక మీడియా (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) పేర్కొంది. అలాగే, బంగ్లాదేశ్ ప్రభుత్వ ఫాక్ట్ చెక్ విభాగం వారు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శుభాశిష్ శర్మ పేరుతో ఉన్న వకాల్తానామా కాపీనీ విడుదల చేసారు.

అలాగే, సైఫుల్ ఇస్లాం అలీఫ్ ఈ కేసులో ప్రభుత్వం తరపు న్యాయవాదుల జాబితాలో కూడా లేరని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ అలం స్పష్టం చేశారు. న్యాయవాది హత్యపై విచారణ చేపట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఆదేశించారు. ఇందులో భాగంగా 30 మందికి పైగా అనుమానితులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చివరిగా, బంగ్లాదేశ్‌ కోర్టు వద్ద హత్య చేయబడ్డ ముస్లిం వ్యక్తి సైఫుల్ ఇస్లాం అలీఫ్ చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపు న్యాయవాది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll