“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే సాక్షి, RTV, నవతెలంగాణ తదితర తెలుగు మీడియా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం ఇటీవల 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది.
ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచినట్లు లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించినట్లు లేదా సమీక్షించినట్లు తెలిపే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే, ఈ వార్తను చాలా మీడియా సంస్థలు తప్పకుండా రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ క్రమంలోనే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొన్నట్లు ఆగస్టు 2023లో ప్రచురించబడిన పలు వార్తా కథనాలను, భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన పత్రికా ప్రకటనను మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 9 ఆగస్టు 2023న కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) జితేంద్ర సింగ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు, సమాధానమిస్తూ ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు’ అని చెప్పారు (ఇక్కడ).

తదుపరి మేము కేంద్ర కేబినెట్ సమావేశాలకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన పత్రికా ప్రకటనలను కూడా పరిశీలించాము (ఇక్కడ). అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని లేదా సమీక్షించిందని చెప్పే ఎలాంటి సమాచారం లభించలేదు. ఇటీవల, 06 నవంబర్ 2024న, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు (ఇక్కడ). ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రస్తావన లేదు.

5వ కేంద్ర వేతన సంఘం (CPC) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 60కి పెంచాలని సిఫార్సు చేసింది. అయితే, గరిష్ట పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు మించరాదని, వయస్సుకు మించిన సర్వీసు పొడిగింపులపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది (ఇక్కడ, ఇక్కడ). 7వ కేంద్ర వేతన సంఘం (CPC) తమ రిపోర్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఎటువంటి సిఫార్సులు చేయలేదని మేము కనుగొన్నాము. అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు పైనే ఉంది. సెప్టెంబరు 2017లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచింది, అయితే ఇది సెంట్రల్ హెల్త్ సర్వీస్ (CHS) వైద్యులకు వర్తించదు (ఇక్కడ).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచిందని పేర్కొంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా. భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 19 నవంబర్ 2024న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X(ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ వార్త అవాస్తవమని, కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది (ఇక్కడ).
చివరగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు.