ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మహిళలు 57 డెల్ (నొప్పిని కొలిచే యూనిట్) నొప్పిని అనుభవిస్తారని ,ఆ నొప్పి 20 ఎముకలు ఒకేసారి విరిగినప్పుడు వచ్చేంత నొప్పితో సమానం అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి ఒకేసారి 45 డెల్ నొప్పిని అనుభవించినప్పుడు మరణిస్తాడు అని పొస్ట్‌లో రాసి ఉంది. ఈ కథనం ద్వారా పోస్ట్‌లో చెప్పిన వాటిల్లో నిజానిజాల్ని తెలుసుకుందాం.
క్లెయిమ్: స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు 57 డెల్ (నొప్పిని కొలిచే యూనిట్) నొప్పిని భరిస్తుంది; ఆ నొప్పి 20 ఎముకలు ఒకేసారి విరిగినప్పుడు వచ్చేంత నొప్పితో సమానం.
ఫాక్ట్ (నిజం): 1948లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, ‘డోల్’ అనేది నొప్పిని కొలిచే యూనిట్. ‘డోల్ స్కేల్’ నొప్పి స్థాయిలను అంచనా వేస్తుంది. ఈ స్కేల్ ప్రకారం ఒకరు అనుభవించగల గరిష్ట నొప్పి స్థాయి 10.5 వద్ద ఉంటుంది. పురుషులు మరియు స్త్రీలకు సంబంధించి పోస్ట్‌లో పేర్కొన్న నొప్పి విలువలు డోల్ స్కేల్‌లో గరిష్ట స్థాయికి మించి ఉన్నందున అవి సాధ్యం కాదు. అందువల్ల పోస్ట్‌లో చేసిన దావా తప్పు.
మొదట, నొప్పిని కొలవడానికి ‘డెల్’ పేరుతో యూనిట్ లేదు. నొప్పి అధ్యయనానికి సంబంధించి 1948లో ప్రచురించిన ఒక పేపర్ ప్రకారం, ‘డోల్’ అనేది నొప్పిని కొలిచే యూనిట్,డెల్ కాదు. ‘డోల్ అనేది నొప్పి యొక్క యూనిట్‌ను సూచించడానికి ఉపయోగించే పదం మరియు గరిష్ట నొప్పి యొక్క తీవ్రతలో దాదాపు పదవ వంతు విలువను కలిగి ఉంటుంది’ అని పేపర్ నివేదించింది. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా ఇదే పేపర్‌ను తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
నొప్పి తీవ్రతను కొలవడానికి “డోల్ స్కేల్”ను కనుగొన్నారు. డోలోరిమీటర్ను ఉపయోగించి నొప్పి స్థాయిని లెక్కించారు. ఈ పేపర్‌లో ప్రచురించబడిన పరిశోధన ఆధారంగా, 10.5 గరిష్ట నొప్పిని మనం అనుభవించవచ్చు. పురుషులు మరియు స్త్రీలకు సంబంధించి పోస్ట్‌లో పేర్కొన్న నొప్పి విలువలు డోల్ స్కేల్‌లో గరిష్ట స్థాయికి మించి ఉన్నందున అవి సాధ్యం కాదు.
తరువాత, హార్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా నొప్పి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి 10 పాయింట్ల స్కేల్‌ను అభివృద్ధి చేసింది. ఈ స్కేల్ నర్సులు మరియు వైద్యుల మెరుగైన పర్యవేక్షణ కోసం వాడతారు. ఒకరు ఎంత నొప్పిని అనుభవిస్తున్నారో పర్యవేక్షించి, తద్వారా సరైన చికిత్సను అందించడానికి సహాయం చేస్తుంది. ఈ స్కేల్ కూడా 0-10 స్కేల్‌లో నొప్పిని అంచనా వేస్తుంది కాబట్టి, పోస్ట్‌లో పేర్కొన్న విలువలు ఈ స్కేల్‌కి సంబంధించినవి కావు.
చివరిగా, ప్రసవ సమయంలో స్త్రీ అనుభవించే నొప్పి 57 డెల్ కాదు.