Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ముస్లిం పండ్ల వ్యాపారి పండ్లకు ఉమ్ము రాస్తున్న వీడియో ఫిబ్రవరిలో తీసినది, మధ్య ప్రదేశ్ మొదటి కొరోనావైరస్ కేసులను మార్చి లో గుర్తించారు

0

ఒక ముస్లిం పండ్ల వ్యాపారి తన తన తోపుడు బండి మీదఉన్న పండ్లకు ఉమ్ము రాస్తున్న వీడియో ని దేశం లో ప్రస్తుతం కొరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ వ్యక్తి కొరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నట్లుగా సోషల్ మీడియా లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనావైరస్ వ్యాప్తి చేయడానికి ముస్లిం పండ్ల వ్యాపారి తన తోపుడు బండి మీద ఉన్న పండ్లకు ఉమ్ము రాస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని రైసెన్ జిల్లా లో ఒక వ్యక్తి ఫిబ్రవరి 2020 లో చిత్రీకరించినది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లో మొదటి కొరోనావైరస్ కేసులను 20 మార్చి రోజున గుర్తించారు. అంటే వీడియో ఆ రాష్ట్రం లో మొదటి కొరోనావైరస్ కేసు నమోదవడానికంటే చాలా ముందు తీసినది. కావున, పాత వీడియో పెట్టి తప్పుద్రోవ పట్టిస్తున్నారు.

వీడియో గురించి సమాచారం తెలుసుకోవడానికి యూట్యూబ్ లో ‘Fruit seller applying saliva to fruits’ అని వెతికినప్పుడు, ఆ విజువల్స్ తో ఉన్న ‘ANI’ వీడియోలభించింది. అందులో రైసెన్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోందని తమ దృష్టికి వచ్చిందని, తమ పరిశీలన లో అది పాత వీడియో అని తేలిందని, దాని గురించి మరింత సమాచారం కొరకు పోలీసు దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేసింది.

వీడియో లోని పండ్ల వ్యాపారి పై 03 ఏప్రిల్ న నమోదైన కేసుకి సంబంధించిన FIR ని ఇక్కడ చూడవచ్చు. అందులో ఆ వీడియో ని 16 ఫిబ్రవరి 2020 న తీసానని, వ్యాపారి (షేరు మియా) అలా పండ్లకి ఉమ్ము అంటించి అమ్మడం వల్ల వాటిని కొన్న వారికి అనేక రోగాలు సంక్రమించే ఆస్కారం ఉండడం తో తాను అతని పై చర్య తీస్కోవలసిందిగా కేసు పెడుతున్నట్లు దీపక్ అనే వ్యక్తి తెలిపాడు.

ఆ ఘటన గురించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, ‘Dainik Bhaskar’ కథనం లభించింది. అందులో పండ్ల వ్యాపారి (షేరు మియా) కుమార్తె ఫిజా మాట్లాడుతూ, తన తండ్రికి గత కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి బాగా లేదని, ఆయనకి ఎప్పటినుండో డబ్బు లెక్కపెట్టేప్పుడు చేతివేళ్ళకి ఉమ్ము పెట్టుకుని లెక్కించడం అలవాటని, ఇంట్లో కూడా తరుచుగా అలానే చేస్తుంటాడని, అదే అలవాటుతో వీడియో లో పండ్లకు ఉమ్ము పెడుతున్నాడని, సాధారణంగా ఒత్తిడిలో  ఉన్నప్పుడు అతను అలా చేస్తాడని చెప్పింది.

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో మొదటి కొరోనావైరస్ కేసులు 20 మార్చి న నమోదైనట్లుగా ఈ న్యూస్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వీడియో ఆ రాష్ట్రం లో మొదటి కొరోనావైరస్ కేసు నమోదవడానికంటే చాలా ముందు తీసినది. కావున కొరోనావైరస్ వ్యాప్తి చేయడానికే ఆ వ్యాపారి ఆలా చేస్తున్నాడనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll