కోర్టులో నాథూరామ్ గాడ్సే విచారణకు అధ్యక్షత వహించి, అతనికి మరణశిక్ష విధించిన జస్టిస్ జి.డి.ఖోస్లా తన “ది మర్డర్ ఆఫ్ మహాత్మ అండ్ అదర్ కేసెస్ ఫ్రమ్ ఎ జడ్జిస్ డైరీ” పుస్తకంలో తన నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అప్పటి ప్రభుత్వ ఒత్తిడి వల్లనే తాను గాడ్సేకి మరణశిక్ష విధించానని ఖోస్లా పేర్కొన్నారని, గాడ్సేకి మరణశిక్ష విధించడం ద్వారా తాను పాపం చేసినట్టు, ఒక ‘అమాయకుడు’ మరియు ‘గొప్ప దేశభక్తుడుకి’ మరణశిక్ష విధించాను అని ఖోస్లా అన్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: గాడ్సేకి మరణశిక్ష విధించిన జస్టిస్ ఖోస్లా, తన పుస్తకంలో ఈ నిర్ణయం పట్ల తన పుస్తకంలో విచారం వ్యక్తం చేసారు.
ఫాక్ట్(నిజం): జస్టిస్ ఖోస్లా తాను సహజంగానే మరణశిక్షకు వ్యతిరేకిని అని అన్నాడు తప్ప, గాడ్సే ఉరి శిక్షను ఉద్దేశించి కాదు. గాడ్సే చేసిన నేరం యొక్క తీవ్రతను ఖోస్లా గుర్తించాడు. ఖోస్లా ఈ పుస్తకంలో ఎక్కడ కూడా గాడ్సే నిర్దోషి అని, తాను ఒక అమాయక దేశభక్తుడికి శిక్ష విధించాను అని గానీ అనలేదు. తాను ప్రభుత్వ ఒత్తిడితోనే మరణశిక్ష విధించినట్లు జస్టిస్ ఖోస్లా ఈ పుస్తకంలో పేర్కొనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మహాత్మా గాంధీ హత్య కేసులో గాడ్సేకి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే, ఐతే గాడ్సే మరణశిక్షను కాకుండా ఈ కేసులో ఆపాదించిన కుట్ర కోణాన్ని అప్పీల్ చేసాడు. ఐతే ఈ అప్పీల్ కేసులో జస్టిస్ జి డి ఖోస్లా అధ్యక్షత వహించారు. విచారణలో జరిగిన సంఘటనలను డాక్యుమెంట్ చేస్తూ 1965లో ‘ది మర్డర్ ఆఫ్ ది మహాత్మా’ అనే పుస్తకాన్ని రాసాడు.
విచారణ సమయంలో కోర్టులో గాడ్సే 150 పేరాగ్రాఫ్‌ల స్టేట్‌మెంట్‌ను ఐదు గంటలకు పైన చదివాడు. ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు జస్టిస్ ఖోస్లా తన పుస్తకంలో గాడ్సే స్టేట్‌మెంట్ గురించి ప్రస్తావించాడు. గాడ్సే స్టేట్‌మెంట్ ప్రేక్షకులపై భావోద్వేగ ప్రభావాన్ని చూపిందని, అతని ప్రకటన తర్వాత కోర్టులో తీవ్ర నిశ్శబ్ద వాతావరణం ఏర్పడిందని రాసుకొచ్చాడు.
ఐతే ఖోస్లా ఈ పుస్తకంలో ఎక్కడ కూడా గాడ్సే నిర్దోషి అని, తాను ఒక అమాయక దేశభక్తుడికి శిక్ష విధించాను అని గానీ అనలేదు. కాకపోతే తాను ముందు నుండే మరణశిక్షకు వ్యతిరేకం అని మాత్రం చెప్పుకొచ్చాడు. ఒక అమాయకుడికి మరణశిక్ష విధించడం తన అతిపెద్ద భయమని సాధారణంగా అన్నాడే తప్ప, గాడ్సే మరణశిక్షను ఉద్దేశించి కాదు.
గాడ్సే చేసిన నేరం యొక్క తీవ్రతను గుర్తిస్తూనే మరణశిక్ష సరైన శిక్షా కాదా అనే సందేహాన్ని వ్యక్తం చేసాడు. గాడ్సే జైలులో ఉన్న తన చివరి రోజులలో తాను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడని ఖోస్లా తెలిపాడు. ఐతే తాను ప్రభుత్వ ఒత్తిడితోనే మరణశిక్ష విధించినట్లు జస్టిస్ ఖోస్లా ఈ పుస్తకంలో పేర్కొనలేదు.
చివరగా, ప్రభుత్వ ఒత్తిడితోనే గాడ్సేకి ఉరిశిక్ష విధించినట్లు జస్టిస్ ఖోస్లా తన పుస్తకంలో రాయలేదు.