09 జూన్ 2024న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియో అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఏప్రిల్ 2024లో గుంటూరులో కృపా మినిస్ట్రీస్ నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభల ఏర్పాట్లకు సంబంధించినవి. ఇదే వీడియోని కృపా మినిస్ట్రీస్ 06 ఏప్రిల్ 2024న తమ ఇంస్టాగ్రామ్ పేజీలో,యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వీడియో యొక్క కీఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను 06 ఏప్రిల్ 2024న ‘krupaministriesofficial’ అనే ఇంస్టాగ్రామ్ పేజీ షేర్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, వీడియోలోని దృశ్యాలు కృపా మినిస్ట్రీస్ వారి అధ్వర్యంలో ఏప్రిల్ 2024లో గుంటూరులో నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభల కోసం జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించినవిగా తెలిసింది.

అలాగే ఇదే వీడియోను కృపా మినిస్ట్రీస్ తమ అధికారిక యుట్యూబ్ ఛానెల్‌లో కూడా షేర్ చేసింది(ఇక్కడ). గుంటూరులో జరిగిన ఈ సువార్త ఉజ్జీవ మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన ఇతర వీడియోలను కూడా కృపా మినిస్ట్రీస్ తమ అధికారిక యుట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది.(ఇక్కడ & ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు గుంటూరులో కృపా మినిస్ట్రీస్ నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభల ఏర్పాట్లకు సంబంధించినవిగా మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఏప్రిల్ 2024లో గుంటూరులో జరిగిన సువార్త ఉజ్జీవ మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ సీఎంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.