Fake News, Telugu
 

మామిడి పండు తిన్న వెంటనే శీతల పానీయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాపాయం కలుగుతుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. యాసిడ్ మరియు ఆర్గానిక్ యాసిడ్ కలిసి ఆరోగ్యానికి హాని కలిగించే విషాన్ని ఏర్పరుస్తాయని, ఇందువల్ల మామిడికాయలు తిన్న తర్వాత శీతల పానీయాలు తీసుకోవద్దని వైద్యులు సూచించారని కూడా పోస్టులో పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రాణాపాయం కలుగుతుంది.

ఫాక్ట్ (నిజం): చండీగఢ్‌లో మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగినందుకు చనిపోయారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మామిడి మరియు కూల్ డ్రింక్స్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ రెండు కూడా వీక్ (బలహీనమైన) ఆసిడ్స్. రెండు వీక్ ఆసిడ్స్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయవచ్చు, దాని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి మామిడి మరియు కూల్ డ్రింక్స్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ కలిపి తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. నిపుణులు కూడా మామిడికాయను కార్బోనేటేడ్ డ్రింక్‌తో కలిపి తీసుకోవడం ప్రాణాంతకం కాదని ధ్రువీకరించారు. కాకపోతే ఇది శరీరంలో చక్కెర మరియు అసిడిటీ స్థాయిలను పెంచుతుందని, ఇది ఆరోగ్యకరమైన జీవనానికి మంచిది కాదని హెచ్చరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్తున్నట్టు చండీగఢ్‌లో మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగినందుకు చనిపోయారని తెలిపే వార్తా కథనాలేవి మాకు లభించలేదు. ఒకవేళ ఇలా నిజంగానే జరిగి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు.

సాధారణంగా మామిడిలో మాలిక్ మరియు సిట్రిక్ యాసిడ్స్ (ఆమ్లాలు) వంటి సేంద్రీయ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మామిడి పండులోని ఆమ్లత్వాన్ని(అసిడిటీ) కలిగిస్తాయి. ఐతే  మామిడి కంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది బాటిల్ మూత తెరిసినప్పుడు హైడ్రోజన్ మరియు కార్బోనేట్‌గా విడిపోతుంది.

ఐతే మామిడి మరియు కూల్ డ్రింక్స్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ రెండు కూడా చాలా వీక్ (బలహీనమైన) ఆసిడ్స్. అలాగే రెండు వీక్ ఆసిడ్స్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయవచ్చు, దాని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి మామిడి మరియు కూల్ డ్రింక్స్‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ కలిపి తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు.

విశ్వాస్ న్యూస్ అనే ఫాక్ట్-చెకింగ్ సంస్థ వైరల్ అవుతున్న విషయానికి సంబంధించి వివరణ కోసం ఇండియా డైటెటిక్ అసోసియేషన్ (IDA) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నజ్నీన్ హుస్సేన్‌ను సంప్రదించగా, ఆమె వైరల్ అవుతున్న వార్త తప్పని ధ్రువీకరించారు. కాకపోతే మామిడిపండ్లు మరియు శీతల పానీయాలలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రెండింటినీ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర మరియు అసిడిటీ లెవెల్స్ పెరుగుతాయని హెచ్చరించారు.

చివరగా, మామిడి పండు తిన్న వెంటనే శీతల పానీయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll