ఇటీవల బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా వివాదం నేపథ్యంలో, పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో షారుఖ్ ఖాన్ ఫోటో దిగాడు అని, వారిరువురికీ సంబంధాలు ఉన్నాయి అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో షారుఖ్ ఖాన్ ఫోటో దిగాడు, వారిరువురికి సంబంధాలు ఉన్నాయి.
ఫాక్ట్: హఫీజ్ సయీద్‌తో షారుఖ్ ఖాన్‌కి సంబంధాలు ఉన్నాయని భారత ప్రభుత్వం చేత కానీ, మీడియాలో ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా లేదు. పైగా 2013 లో హఫీజ్ సయీద్ షారుఖ్ ని భారత్‌ను విడిచి పాకిస్థాన్ కు రమ్మని ఆహ్వానిస్తే, దానిని షారుఖ్ ఖండిస్తూ, భారత్ దేశంలో చాలా భద్రంగా, సుఖంగా ఉన్నాము అని, లేని పోనీ సలహాలు ఇచ్చే వారు ఈ విషయం తెలుసుకోవాలి అని స్పష్టం చేశాడు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా షారుఖ్ ఖాన్‌కి హఫీజ్ సయీద్‌తో సంబంధాలు ఉన్నాయా అని వెతకగా భారత ప్రభుత్వం కానీ, మీడియాలో కానీ ఎక్కడా వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రకటించలేదు. ఇద్దరూ కలిసి ఫోటో దిగారు అనడానికి కూడా ఎటువంటి సాక్ష్యం లేదు. అయితే 2013లో ‘Outlook Turning points’ అనే మాగజీన్‌లో షారుఖ్ వ్యాసానికి బదులిస్తూ, ఒకవేళ షారుఖ్ ఖాన్‌కి భారత్ లో భద్రత లేకుంటే, ఆయనను పాకిస్థాన్ కు ఆహ్వానిస్తున్నాం అని హఫీజ్ అన్నాడు.
ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, షారుఖ్ ఈ విధంగా సమాధానమిచ్చాడు, “ఈ వ్యాసంలో నేను కేవలం కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ‘భారత-ముస్లిం’ నటుణ్ని అయిన నా గుర్తింపును ఎలా వాడుకుంటున్నారో అనే దాని గురించి చర్చించాను. దేశం విడవాలని ఎవరైతే నాకు లేనిపోనీ సలహాలు ఇస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భారత దేశంలో మేము చాలా భద్రంగా, సుఖంగా ఉన్నాము.”
చివరిగా, పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో షారుఖ్ ఖాన్ ఫొటోలు దిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవు.