ఖతార్ భారతదేశానికి క్షమాపణలు చెప్పిందంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఇటీవల ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గాను ఖతార్ భారత ప్రభుత్వాన్ని క్షమాపణలు చెప్పమని అడిగింది. గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు ఎగుమతి ఆపేయటంతో తర్వాత వచ్చి భారతదేశానికి క్షమాపణలు చెప్పిందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు ఎగుమతి ఆపేయటంతో భారతదేశానికి క్షమాపణలు చెప్పిన ఖతార్.
ఫాక్ట్: ఖతార్ ఇటీవల భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను పిలిపించి, నూపుర్ శర్మ మరియు నవీన్ జిందాల్ ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక నోట్‌ను అందజేసింది. భారత ప్రభుత్వం నుండి బహిరంగ క్షమాపణ కోరింది. దీనికి నిరసనగా భారతీయులు కొంతమంది బాయ్‌కాట్ ఖతర్ ఎయిర్‌వేస్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా చేసారు. అసలు గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు భారత్ ఎగుమతులు ఆపినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఖతార్ ఇటీవల భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అటువంటిది జరిగుంటే అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.
ఇటీవల ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను పిలిపించి, నూపుర్ శర్మ మరియు నవీన్ జిందాల్ ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక నోట్‌ను అందజేసింది. భారత ప్రభుత్వం నుండి బహిరంగ క్షమాపణ కోరింది. దీనికి నిరసనగా భారతీయులు కొంతమంది బాయ్‌కాట్ ఖతర్ ఎయిర్‌వేస్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా చేసారు.
ఇటీవల గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు భారత్ ఎగుమతులు ఆపేయటంతో తర్వాత భారతదేశానికి క్షమాపణలు చెప్పిందని న్యూస్ ఆర్టికల్స్ లేవు. అసలు ఎగుమతులు ఆపినట్టు ఆధారాలు లేవు. ఖతార్ మరియు భారతదేశం మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉత్సవాలకు ఖతార్‌కు వెళ్లారు కూడా. అంతే కాదు, ఖతార్ ఆహార భద్రత అవసరాలను తీర్చడంలో భారతదేశం యొక్క సహాయాన్ని ఖతార్ నాయకత్వానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హామీ కూడా ఇచ్చారు.
చివరగా, గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు ఎగుమతి ఆపేయటంతో ఖతార్ ఇటీవల భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.