Fake News, Telugu
 

విద్యార్థులను మందలిస్తే అధ్యాపకులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని దేశంలోని ఏ న్యాయస్థానం ఆదేశాలివ్వలేదు

0

కాలేజీలలో చదువుతున్న లాస్ట్ బెంచ్ విద్యార్థులను ఉపాధ్యాయులు నోట్సు లేవని, ఆలస్యంగా వచ్చారని ఇబ్బంది పెడితే వారికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉపాధ్యాయులు విద్యార్థులను నోట్సు లేవని, ఆలస్యంగా వచ్చారని ఇబ్బంది పెడితే సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలిచ్చించి.

ఫాక్ట్ (నిజం): విద్యార్థులను మందలిస్తే అధ్యాపకులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని దేశంలోని ఏ రాష్ట్ర హైకోర్టు గానీ, సుప్రీం కోర్టు గానీ ఆదేశాలివ్వలేదు. 2008లో ఒక విధ్యార్ధి ఆత్మహత్య కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు 24 నవంబర్ 2022 నాడు ఇచ్చిన తీర్పులో, విద్యా సంస్థలను నడపడానికి ప్రాథమిక క్రమశిక్షణ చర్యలు తప్పక అవసరమని, అవి లేకుంటే చట్టవిరుద్ధమైన చర్యలు ఎక్కువై విధ్యాసంస్థలను నడపలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు విద్యార్థులను మందలించే అధ్యాపకులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని ఏ రాష్ట్ర హైకోర్టు అయిన ఆదేశాలిచ్చిందా అని వెతికితే, దేశంలోని ఏ ఒక్క రాష్ట్ర హైకోర్టు అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని తెలిసింది. దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా అటువంటి ఆదేశాలిచ్చినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. అసలు, ఇటువంటి వార్తా ఏదీ Way2News యాప్ పబ్లిష్ చేయలేదు.

పంజాబ్ రాష్ట్రంలో ఒక విధ్యార్ధి ఆత్మహత్యకు సంబంధించి విద్యార్థి అధ్యాపకులు మరియు విద్యా సంస్థ యాజమాన్యాన్ని దోషులుగా ఆరోపిస్తూ 2008లో ఒక కేసు ఫైల్ అయ్యింది. ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు 24 నవంబర్ 2022 నాడు ఇచ్చిన తీర్పులో, విద్యా సంస్థలను నడపడానికి ప్రాథమిక క్రమశిక్షణ చర్యలు తప్పక అవసరమని, అవి లేకుంటే చట్టవిరుద్ధమైన చర్యలు ఎక్కువై విద్యా సంస్థలను నడపలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. అధ్యాపకులు విద్యార్థులను తిట్టడం లేదా మందలించడం అనేది వారిని ఆత్మహత్యకు లేదా మరే ఇతర మానసిక అఘాయిత్యాలకు ప్రేరేపించే చర్యగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పలు సార్లు స్పష్టం చేసింది.

చివరగా, విద్యార్థులను మందలిస్తే అధ్యాపకులకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలని దేశంలోని ఏ న్యాయస్థానం ఆదేశాలివ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll