Fake News, Telugu
 

కమలాపూర్‌లో బీజేపీ నేతకు చెందిన కారులో 122 కోట్లు దొరికాయన్న వార్త అవాస్తవం

0

హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన ఒక కార్ ఆక్సిడెంట్‌లో బీజేపీ నేతకు చెందిన కారులో ఈటల రాజేందర్‌ కి చెందిన జమున హేచరీలకు సంబందించిన 122 కోట్ల రూపాయలు దొరికినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కమలాపూర్‌లో జరిగిన కార్ ఆక్సిడెంట్‌లో బీజేపీ నేతకు చెందిన కారులో ఈటల రాజేందర్‌ యొక్క జమున హేచరీలకు చెందిన 122 కోట్లు దొరికాయి.

ఫాక్ట్ (నిజం): కమలాపూర్‌లో ఇటీవల జరిగిన కార్ ఆక్సిడెంట్‌లో ఎటువంటి నగదు లభించలేదు. ఈ ఆక్సిడెంట్‌కి సంబంధించి వరంగల్‌ సీపీ విడుదల చేసిన ప్రకటనలో కారు డ్రైవర్‌కుగానీ లేక యజమానికిగానీ ఏ పార్టీతో సంబంధాలు లేవని స్పష్టం చేసారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 1,45,20,727 రూపాయల నగదును, 1,50,000 రూపాయల విలువ గల 30 గ్రాముల బంగారం, 9,10,000 రూపాయల విలువ గల 14 కిలోల వెండిని, 5,11,652 రూపాయల విలువ గల 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు  తెలిపారు. అలాగే 2,21,000 రూపాయల విలువ గల 66 చీరలు, 50 షర్టులను సరైన పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల 11 అక్టోబర్ 2021న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని భీంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఒక కారు, ఆటో ఢీకొనడంతో ఆక్సిడెంట్ జరిగింది. ఈ ఆక్సిడెంట్‌కి సంబంధించిన వార్తను చాలా పత్రికలు ప్రచురించాయి. ఈ కథనాలలో ఆక్సిడెంట్‌కి సంబంధించిన కారు యజమాని పేరు విశ్వనాధ్ వినోద్ అని పేర్కొన్నారు. పోస్టులో చెప్తున్నది ఈ ఆక్సిడెంట్ గురించే.

ఐతే పత్రికా కథనాల ప్రకారం ఈ ఆక్సిడెంట్‌కి సంబంధించి వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రోడ్డు ప్రమాదంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా జరిగిన ప్రమాదం కాదని, ఇది పూర్తిగా రోడ్డు ప్రమాదమే. ఘటనపై పోలీసులు ప్రాథమికంగా విచారణ చేసి రోడ్డు ప్రమాదంగా నిర్ధారించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశాము. ఘటనకు సంబంధించి కారు డ్రైవర్‌కు, యజమానికి ఏ పార్టీతో సంబంధాలు లేవు’  అని వరంగల్‌ సీపీ ప్రకటనలో పేర్కొన్నట్టు కూడా ఈనాడు తమ కథనంలో పేర్కొంది.

ఈ ఆక్సిడెంట్‌ని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలుగాని, లేక ఆక్సిడెంట్‌కి సంబంధించి వరంగల్‌ సీపీ విడుదల చేసిన ప్రకటనలోగాని కారులో డబ్బులు దొరికినట్టు పేర్కొనలేదు. ఒకవేళ నిజంగానే ఈ ఆక్సిడెంట్‌కి సంబంధించిన కారులోగాని లేక హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో నియోజికవర్గ పరిధిలో ఎక్కడైనాగానీ పోస్టులో చెప్తున్నంత పెద్ద మొత్తంలో డబ్బు దొరికినట్టు ఎటువంటి కథనాలు లేవు.

హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు సీజ్ చేసిన నగదుకు సంబంధించిన వివరాల కోసం FACTLY సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించగా, ‘హుజురాబాద్‌లో 122 కోట్లు దొరికాయన్న వార్త అవాస్తమని, అలాగే ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదును, 1,50,000 రూపాయల  విలువ గల 30 గ్రాముల బంగారం ,9,10,000 రూపాయల విలువ గల  14 కిలోల వెండిని ,5,11,652 రూపాయల విలువ గల 867 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు  తెలిపారు. అలాగే 2,21,000 రూపాయల విలువ గల 66 చీరలు, 50 షర్టులను సరైన పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు’. ఇదే విషయానికి సంబంధించి జిల్లా కలెక్టర్ విడుదల చేసిన మీడియా ప్రకటనని షేర్ చేసారు.

జిల్లా కలెక్టర్ విడుదల చేసిన మీడియా ప్రకటనని అనేక మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాలలో కూడా పైన తెలిపిన విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. వీటన్నిటి ఆధారంగా హుజురాబాద్ బీజేపీ నేతకు చెందిన కారులో 122 కోట్లు దొరికాయన్న వార్త అవాస్తవమని స్పష్టమవుతుంది.

చివరగా, కమలాపూర్‌లో బీజేపీ నేతకు చెందిన కారులో 122 కోట్లు దొరికాయన్న వార్త అవాస్తవం, హుజురాబాద్‌లో ఇప్పటివరకు 1.45 కోట్లని అధికారులు సీజ్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll