Fake News, Telugu
 

పాకిస్తాన్ PMO భారత్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయనూ లేదు; ప్రధాని మోదీ ఆ ట్వీట్ కు స్పందించనూలేదు

0

ఫాదర్స్ డే సందర్భంగా పాకిస్తాన్ PMO భారతదేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిందని, ప్రధాని నరేంద్ర మోదీ ‘థాంక్యూ బెటా’ అని బదులిచ్చారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ PMO ‘హ్యాపీ ఫాదర్స్ డే ఇండియా’ అని ట్వీట్ చేసింది, ప్రధాని మోదీ ‘థాంక్యూ బెటా’ అని బదులిచ్చారు.

ఫాక్ట్: ఫాదర్స్ డే సందర్భంగా పాకిస్తాన్ PMO, నరేంద్ర మోదీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాల ద్వారా అటువంటి ట్వీట్లు చేయలేదు. ఈ పోస్ట్ లోని ఇమేజ్ ను ‘comedyculture.in’ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజీ తయారు చేసింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫాదర్స్ డే సందర్భంగా పాకిస్తాన్ PMO, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ట్విట్టర్ ఖాతాల ద్వారా చేసిన ట్వీట్ లు మరియు వార్తా కథనాల కోసం చూసినప్పుడు, అటువంటివి ఏవీ లభించలేదు. పోస్ట్ లోని ఇమేజ్ ను పరిశీలించినప్పుడు, comedyculture.in అని పేరుతో ఉన్న వాటర్ మార్క్ చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో comedyculture.in కోసం వెతికినప్పుడు, ‘బిల్డింగ్ ది ఇండియన్ మీమ్ సబ్ కల్చర్’ అని వారి హోమ్ పేజీలో రాశారు. మరియు పోస్ట్ లో అదే ఇమేజ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో చూడొచ్చు.

పోస్ట్ లోని ఇమేజ్ ని స్పష్టంగా చూసినప్పుడు, @PakistanPMO ఖాతా పాకిస్తాన్ PMO యొక్క అధికారిక ఖాతా కాదని చూడవచ్చు. వాస్తవానికి, అకౌంట్ ను తెరవడానికి ప్రయత్నించినప్పుడు, అది ట్విట్టర్ ద్వారా సస్పెండ్ చేయబడినట్లు తెలుస్తుంది. ఇమేజ్ లో నరేంద్ర మోదీ సమాధానం పక్కన రాసిన ‘4d’ లాజికల్ గా తప్పు. ‘4d’ అంటే, ట్విట్టర్ లో ఈ పోస్ట్ కి 4 రోజుల ముందు బదులిచ్చినట్టు అర్ధం. కానీ, ఇమేజ్ లోని తేదీ 20 జూన్ 2021 మరియు ఈ ఆర్టికల్ 23 జూన్ 2021న ప్రచురించబడుతోంది. అంటే, ట్వీట్ చేసి మూడు రోజులే అవుతోంది. కాబట్టి, 4 రోజుల ముందు బదులిచ్చే అవకాశమే లేదు.

చివరగా, పాకిస్తాన్ PMO భారత్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయనూలేదు, ప్రధాని మోదీ ఆ ట్వీట్ కు స్పందించనూలేదు.

Share.

About Author

Comments are closed.

scroll