Fake News, Telugu
 

ఆధార్ మొదలు దేశంలో బ్యాంకింగ్/ఆర్ధిక రంగంలో వచ్చిన సాంకేతికత మార్పులను ఉద్దేశించి నందన్ నిలేకని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

సంప్రదాయ పద్ధతుల్లో 47 ఏళ్లు పట్టే ప్రగతిని భారత్ మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలోనే సాధించింది అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అన్నాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్:  సంప్రదాయ పద్ధతుల్లో 47 ఏళ్లు పట్టే ప్రగతిని భారత్ మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలోనే సాధించింది – ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని

ఫాక్ట్(నిజం):  ఇటీవల జరిగిన ఒక బిజినెస్ మీటింగ్‌లో మాట్లాడుతూ ఆధార్ మొదలు KYC, e-KYC, జన్-ధన్ ఖాతాలు, డిజిలాకర్ వంటి డిజిటల్ మార్పుల వల్ల సాంప్రదాయ పద్దతిలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇంక్లూషన్ రంగాల్లో 47 ఏళ్లు పట్టే వృద్దిని భారతదేశం తొమ్మిదేళ్లలోనే సాధించిందని అన్నారు. ఐతే ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు, మొత్తం ప్రగతికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మరియు ఆధార్ అథారిటీ (UIDAI) వ్యవస్థాపక చైర్మన్ నందన్ నీలేకని ఇటీవల ఒక బిజినెస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ భారత్ 9 ఏళ్లలో సాధించిన డిజిటల్ పరివర్తన గురించి ప్రశంసిచాడు.

G20 సమావేశాలలో భాగంగా జరిగిన B20 మీటింగ్‌లో భారత్ సాధించిన డిజిటల్ పరివర్తన గురించి మాట్లాడుతూ, భారత్ ప్రవేశపెట్టిన ఆధార్ (డిజిటల్ ఐడి), KYC, e-KYCతో పాటు 2016లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా, జన్-ధన్ ఖాతాలు దేశ పౌరులను బ్యాంకింగ్ రంగానికి అనుసంధానించడం వల్ల ఆర్ధిక పురోగతితో పాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా మార్పులు తీసుకొచ్చిందని అన్నారు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ భారత్ ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ మార్పుల వల్ల సాంప్రదాయ పద్ధతిలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇంక్లూషన్ రంగాల్లో 47 ఏళ్లు పట్టే వృద్దిని భారతదేశం తొమ్మిదేళ్లలోనే సాధించిందని అన్నారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక రంగంలో ‘ఆధార్ మొదలు జన్-ధన్ ఖాతాలు, డిజిలాకర్ వంటి డిజిటల్ మార్పులను ఉద్దేశించి’ తొమ్మిదేళ్లలో ఈ రంగాల్లో వృద్ది సాధించింది అని నిలేకని నిలేకని అన్నాడు గాని, మోడీ ప్రభుత్వ హయాంలో ప్రగతి గురుంచి కాదు.

నిలేకని ప్రస్తావించిన డిజిటల్ మార్పులను గమనిస్తే కూడా మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. ఆధార్ (డిజిటల్ ఐడి), KYC వంటి సాంకేతికత 2014లో మోదీ అధికారంలోకి రాక ముందు నుండే బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టారు.

ఈ సాంకేతికత మార్పు దేశంలోని పౌరులకు విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలు లక్ష్యంగా ఉన్న ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆయన అన్నారు. ఆ తరవాత తన ప్రసంగంలో నిలేకని మాట్లాడుతూ డిజిటల్ టాక్స్ సిస్టం, UPI, ఫాస్ట్-ట్యాగ్ వంటి సాంకేతికత మార్పులను ఉద్దేశించి మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కాకపోతే, ప్రస్తుతం వైరల్ అవుతున్న కామెంట్ మాత్రం ఆయన ఆధార్ మొదలు దేశంలో బ్యాంకింగ్/ఆర్ధిక రంగంలో వచ్చిన మార్పులను ఉద్దేశించి చేసినవి. ఐతే నిలేకని చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తొమ్మిదేళ్ల మోదీ పాలనకు, అన్ని రంగాల్లో ప్రగతికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

చివరగా, ఆధార్ మొదలు దేశంలో బ్యాంకింగ్/ఆర్ధిక రంగంలో వచ్చిన మార్పులను ఉద్దేశించి నందన్ నిలేకని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll