Fake News, Telugu
 

లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA ఎటువంటి టోకెన్‌లు అందించట్లేదు

0

సెప్టెంబర్ 9న జరిగిన లోక్ అదాలత్ ద్వారా ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇందుకోసం NALSA (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవాలని, ఆ తరవాత కోర్టుకు వెళ్లి ఫైన్‌లు తక్కువకు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అంటూ వార్తలు షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: NALSA వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవడం ద్వారా సెప్టెంబర్ 9న జరగబోయే లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవచ్చు.

ఫాక్ట్(నిజం): దేశవ్యాప్తంగా జరగబోయే లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA ఎటువంటి టోకెన్‌లు అందించట్లేదు. ఇదే విషయాన్ని NALSA ఒక నోటీసు ద్వారా తెలిపింది. పైగా ఈ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ ఉన్నట్టు సమాచారం లేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అనేక కోర్టులలో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విచారణలో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, మొదలైన కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్‌ అదాలత్‌లు కల్పిస్తాయి.

ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు ఈ లోక్‌ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకునేందుకు NALSA టోకెన్‌లు అందిస్తుందన్న వార్తలో నిజం లేదు. పలు ప్రముఖ పత్రికలు కూడా లోక్‌ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం టోకెన్‌లు అందిస్తుందని వార్తలు ప్రచురించడంతో ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది.

ఐతే NALSA మాత్రం తాము ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్‌ల కోసం ఎలాంటి టోకెన్‌లు అందించట్లేదని ఒక నోటీసు విడుదల చేసింది. తమ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది

తెలంగాణలో నిర్వహించే లోక్ అదాలత్‌లకు సంబంధించి తెలంగాణ హై కోర్టు విడుదల చేసిన నోటీసులో కూడా ప్రత్యేకించి ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ ప్రస్తావన ఐతే లేదు.

ఐతే గతంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ట్రాఫిక్ చలాన్‌లు సెటిల్మెంట్ చేసుకోవడం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా లోక్ అదాలత్‌లకను నిర్వహించిన అనుభవాలు ఉన్నాయి. కానీ, 9 సెప్టెంబర్ 2023 రోజు నిర్వహించిన లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ ఉన్నట్టు మాత్రం సమాచారం లేదు.

చివరగా, 9 సెప్టెంబర్ 2023 రోజు నిర్వహించిన లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA ఎటువంటి టోకెన్‌లు అందించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll