Fake News, Telugu
 

ఈ డ్రోన్ వీడియోలో కనిపిస్తున్న వారందరూ మావోయిస్టులు కాదు

0

ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టుల వీడియో అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టుల వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో ఉన్నది గ్రామస్తులు అని, కొత్తగా నిర్మించిన రోడ్డు ని తవ్వటానికి కొందరు మావోయిస్టులు వారిని తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రోన్ సహాయంతో ఆ వీడియోని తీసినట్టు అధికారులు తెలిపారు. FACTLY తో మాట్లాడుతూ సుక్మా జిల్లా ఎస్పీ కూడా ఆ వీడియోలో ఉన్నది గ్రామస్తులు అని చెప్పారు. కావున, వీడియోలో కనిపిస్తున్న వారు అందరు మావోయిస్టులు అని పోస్ట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే వీడియోని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారు తమ ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఆ వీడియోలో ఉన్నది గ్రామస్తులు అని, కొత్తగా నిర్మించిన రోడ్డు ని తవ్వటానికి కొందరు మావోయిస్టులు వారిని తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రోన్ సహాయంతో ఆ వీడియోని అధికారులు తీసినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారి పోస్ట్ లో చదవొచ్చు.

ఈ వీడియోపై ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ఆర్టికల్ ని కూడా ప్రచురించారు. వైరల్ అయిన వీడియో 08 సెప్టెంబర్ 2020 న రోజున తీసారని, ఆధార్ కార్డుల కోసం పెట్టిన క్యాంపుకు వచ్చి తిరిగివెళ్తున్న గ్రామస్తులని మావోయిస్టులు పట్టుకొని, కిష్టారం – పల్లోడి మధ్యలో నిర్మించిన రోడ్డు ని తవ్వి నాశనం చేయడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ వీడియోని తీసినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారితో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. అదే రోజు, గ్రామస్తులు తమ గ్రామాలకి తిరిగి వెళ్ళాక, పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ జరిగింది.

సుక్మా జిల్లా ఎస్పీ ని FACTLY సంప్రదించగా, వారు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నది గ్రామస్తులే అని తెలిపారు. వీడియోపై ఒడిశా వార్తాసంస్థ ‘కనక్ న్యూస్’ మరియు ఇతర జర్నలిస్టులు పోస్ట్ చేసిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ చేసిన డ్రోన్ వీడియోలో కనిపిస్తున్న వారందరూ మావోయిస్టులు కాదు. దాంట్లో ఉన్నది ఎక్కువ గ్రామస్తులు.

Share.

About Author

Comments are closed.

scroll