Fake News, Telugu
 

బీహార్ మంత్రి మండలిలో ఉన్న 33 మంది మంత్రులలో ఎక్కువ మంది కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు

0

ఆగస్టు 2022లో NDA కూటమి నుంచి బయటకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి RJD, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో బీహార్ మంత్రి మండలిలోని సభ్యుల యొక్క శాఖలు మరియు విద్యార్హతలు అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ పోస్టు ద్వారా మంత్రిమండలిలో ఉన్న మంత్రులందరికి 12వ తరగతి లేదా అంతకంటే తక్కువ విద్యార్హత ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: నితీశ్ కుమార్ కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలోని మంత్రుల యొక్క విద్యార్హతలు. ఎక్కువ మంది 12 వ తరగతి  లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు.

ఫాక్ట్: బీహార్ ప్రభుత్వ వెబ్‌సైటు ప్రకారం, లిస్టులో ఉన్న 11 మంది ప్రస్తుతం మంత్రులుగా లేరు. ఇక ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారం ప్రకారం, మిగిలిన మంత్రుల విద్యార్హతలు పోస్టులో తప్పుగా చెప్పబడ్డాయి. 33 మంది మంత్రులలో 25 మంది కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ అవుతున్న పోస్టులోని వ్యక్తుల పేర్లని, బీహార్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటులో ఇచ్చిన మంత్రుల పేర్లతో పోల్చగా వీరిలో అబ్దుల్ బారి, మంజు వర్మ, మన్మోహన్ ఝా, విజయ్ ప్రకాష్, కపిల్ దేవ్ కామత్, అబ్దుల్ జలీల్, జై కుమార్ సింగ్, కృష్ణ చంద్ర వర్మ, ఖుర్షీద్ ఫిరోజ్, శైలేష్ కుమార్, శివ చంద్ర రామ్ తదితరులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మంత్రులుగా నియామకం కాలేదు.

ఇక ఎన్నికల సంఘం వెబ్‌సైటులో లభించిన అఫిడవిట్లలో ఉన్న సమాచారం ప్రకారం మిగిలిన మంత్రుల విద్యార్హతలు ఈ పట్టికలో చూడవచ్చు.

     మంత్రి పేరు పోస్టులో ఉన్న విద్యార్హతఎన్నికల అఫిడవిట్ ప్రకారం విద్యార్హత
నితీశ్ కుమార్ (ముఖ్యమంత్రి)ఇంజనీర్B.Sc. (ఇంజనీరింగ్)
తేజస్వి యాదవ్9వ తరగతి ఫెయిల్9వ తరగతి పాస్
తేజ ప్రతాప్ యాదవ్12వ తరగతి ఫెయిల్12వ తరగతి పాస్
బిజేంద్ర యాదవ్10వ తరగతి ఫెయిల్12వ తరగతి పాస్
మదన్ సహాని10వ తరగతిగ్రాడ్యుయేషన్
అశోక్ చౌదరి10వ తరగతిడాక్టరేట్
చంద్రశేఖర్4వ తరగతిపోస్టు గ్రాడ్యుయేషన్
సంతోష్ కుమార్12వ తరగతిడాక్టరేట్
అలోక్ మెహతా4వ తరగతిగ్రాడ్యుయేషన్

ఇక మిగిలిన బీహార్ మంత్రుల విద్యార్హతలు ఈ వార్తా కథనంలో చూడవచ్చు. వీరిలో కూడా ఎక్కువ మందికి  గ్రాడ్యుయేషన్ లేదా అంత కంటే  ఎక్కువ విద్యార్హత ఉంది.

చివరిగా, బీహార్ మంత్రి మండలిలో ఉన్న 33 మంత్రులలో ఎక్కువ మంది కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll