Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని Aaj Tak వార్తా సంస్థ కాబోయే ప్రధానమంత్రి ఎవరని సర్వే నిర్వహిస్తే రాహుల్ గాంధీకి అత్యధిక ఓట్లు వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు

0

‘Aaj Tak’ వార్తా సంస్థ కాబోయే భారత ప్రధానమంత్రి ఎవరనే విషయం పై ఇటీవల ఒక సర్వే నిర్వహిస్తే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 52 శాతం ఓట్లు, ప్రధాని నరేంద్ర మోదీకి 46 శాతం ఓట్లు వచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. 2024లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఈ సర్వే ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘Aaj Tak’ వార్తా సంస్థ కాబోయే భారత ప్రధాని ఎవరనే విషయం పై ఇటీవల సర్వే నిర్వహిస్తే రాహుల్ గాంధీకి 52 శాతం, ప్రధాని నరేంద్ర మోదీకి 46 శాతం ఓట్లు వచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ‘Aaj Tak’ మూడ్ ఆఫ్ ది నేషన్ 2019 సర్వేలోని రెండు వేర్వేరు ప్రశ్నల ఫలితాలను జత చేస్తూ ఈ ఫోటోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఈ ఫోటోలో కనిపిస్తున్నవి  ‘Aaj Tak’ న్యూస్ ఛానల్ 2019 జనవరి నెలలో విడుదల చేసిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ఫలితాలని తెలిసింది. ఈ సర్వే ఫలితాల వివరాలను తెలుపుతూ ‘Aaj Tak’ న్యూస్ ఛానల్ 24 జనవరి 2019 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని పబ్లిష్ చేసింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ‘Aaj Tak’ వారు కార్వీ సంస్థతో కలిసి ఈ సర్వే నిర్వహించారు. ఈ వీడియో ద్వారా పోస్టులో షేర్ చేసిన సర్వే ఫలితాలు రెండు వేర్వేరు ప్రశ్నలకు సంబంధించినవి తెలిసింది.

ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టగల సమర్ధవంతమైన  ప్రతిపక్ష నాయకుడు ఎవరని సర్వే నిర్వహిస్తే, రాహుల్ గాంధీకి అత్యధికంగా 52 శాతం ఓట్లు పడినట్టు ‘Aaj Tak’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ సర్వే పొల్‌లో రాహుల్ గాంధీతో పాటు తలపడిన నాయకులు మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్, మాయావతి. ఈ దృశ్యాలని ‘Aaj Tak’ వీడియోలోని 7:56 నిమిషాల దగ్గరనుంచి చూడవచ్చు. 

అలాగే, భారత దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఎవరనే విషయం పై సర్వే నిర్వహిస్తే, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధికంగా 46 శాతం ఓట్లు వచ్చినట్టు ‘Aaj Tak’ స్పష్టం చేసింది. ఈ సర్వే పొల్‌లో రాహుల్ గాంధీకి 34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ దృశ్యాలని ‘Aaj Tak’ వీడియోలోని 19:54 నిమిషాల దగ్గరనుండి చూడవచ్చు.

‘Aaj Tak’ మూడ్ ఆఫ్ ది నేషన్ 2019 సర్వే ఫలితాల వివరాలను తెలుపుతూ ‘India Today’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో, ‘Aaj Tak’ మూడ్ ఆఫ్ ది నేషన్ 2019 సర్వేలోని రెండు వేర్వేరు ప్రశ్నల ఫలితాలను చూపిస్తున్నట్టు స్పష్టమయ్యింది.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని ‘Aaj Tak’ వార్తా సంస్థ కాబోయే ప్రధానమంత్రి ఎవరని సర్వే నిర్వహిస్తే రాహుల్ గాంధీకి అత్యధిక ఓట్లు వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll