Fake News, Telugu
 

‘కమలం పువ్వు గుర్తుకే మన ఓటు’ అని ఉన్న డప్పును హరీష్ రావు కొడుతున్నట్టు షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడింది

0

తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఈటలని గెలిపించమని కోరుతున్నారని ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. హరీష్ రావు డప్పు కొడుతున్న ఈ ఫోటోలో ‘కమలం పువ్వు గుర్తుకే మన ఓటు’ అని ఉన్నట్టు చూడవొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: డప్పు కొట్టి ఈటలను గెలిపించమని కోరిన హరీష్ రావు ఫోటో.

ఫాక్ట్: అసలు ఫోటోను మార్ఫ్ చేసి “కమలం పువ్వు గుర్తుకే మన ఓటు” అని, బీజేపీ పార్టీ గుర్తు అయిన కమలం పువ్వును కలిపారు. జమ్మికుంటలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ ధూంధాం కార్యక్రమం జరిగినప్పుడు తీసిందే ఈ ఫోటో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. కానీ, ఆర్టికల్‌లోని ఫోటోలో ఎక్కడా కూడా కమలం పువ్వు గానీ, పువ్వు గుర్తుకే ఓటు వెయ్యమని గానీ డప్పులపైన లేదు. హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంగా ఈ ఫోటో తీసినట్టు తెలుస్తుంది. జమ్మికుంట మండలం మాడిపల్లిలో హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించినప్పుడు ఇలా డప్పు కొట్టారని తెలుస్తుంది.

జమ్మికుంటలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ ఫోటో తీసారనే క్లూతో ఇంటర్నెట్‌లో వెతకగా, అటువంటి ఫోటోకు సంబంధించి నమస్తే తెలంగాణ వారు ఒక ట్వీట్ చేసారు. ఆ ఫోటోలో ఎక్కడా కూడా కమలం పువ్వు గానీ, పువ్వు గుర్తుకే ఓటు వెయ్యమని గానీ డప్పులపైన లేదు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోరుతూ ఈ యొక్క ధూంధాం కార్యక్రమం జరిగిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను హరీష్ రావు అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి రి ట్వీట్ కూడా చేసారు.

ఫోటోను జాగ్రత్తగా గమనించినట్లైతే, దాన్ని మార్ఫ్ చేసి “కమలం పువ్వు గుర్తుకే మన ఓటు” అని, మరియు బీజేపీ పార్టీ గుర్తు అయిన కమలం పువ్వు కలిపారని తెలుస్తుంది.

చివరగా, ‘కమలం పువ్వు గుర్తుకే మన ఓటు’ అని ఉన్న డప్పును హరీష్ రావు కొడుతున్నట్టు షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll