కొరోనా వ్యాధిని అరికట్టడంలో జీ-7 (గ్రూప్ అఫ్ సెవెన్) దేశాలకి ప్రధాని మోదీని నాయకత్వం వహించమని బ్రిటన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మరియు ఆస్ట్రేలియా ప్రధాని కోరినట్టు చెప్తూన్న ఒక యూట్యూబ్ వీడియోతో (ఆర్కైవ్డ్) కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: కొరోనా వ్యాధిని అరికట్టడంలో జీ-7 (గ్రూప్ అఫ్ సెవెన్) దేశాలకి ప్రధాని మోదీని నాయకత్వం వహించమని కోరిన అగ్రరాజ్యాలు.
ఫాక్ట్ (నిజం): వీడియోలో చెప్పినట్టు కొరోనా వ్యాధిని అరికట్టడంలో జీ-7 దేశాలకి మోదీని నాయకత్వం వహించమని బ్రిటన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మరియు ఆస్ట్రేలియా ప్రధాని కోరలేదు. అసలు జీ-7 గ్రూప్ లో ఇండియా మెంబెర్ కూడా కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో పెట్టిన వీడియో చూస్తే, మోడీ ని నాయకత్వం వహించమని అగ్ర రాజ్యాలు కోరినట్టు ‘WION’ టీవీ వారు ఒక వార్తని టెలికాస్ట్ చేసినట్టు వీడియోలోని వ్యక్తి చెప్తాడు. కానీ, అలాంటి వార్తను ‘WION’ టీవీ వారు టెలికాస్ట్ చేసినట్టు ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా లేదు. కానీ, ‘World leaders laud PM Modi’s initiative, Australia welcomes PM Modi’s calls for G20 linkup as well’ అనే టైటిల్ తో 15 మార్చి 2020 న ఒక వీడియోని వారి యూట్యూబ్ అకౌంట్ లో పెట్టినట్టు చూడవొచ్చు. సార్క్ దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంలో మరియు సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయడంలో మోదీ ముఖ్యపాత్ర పోషించినట్టు తెలుస్తుంది. వీడియోలో ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడుతూ జీ-20 కాన్ఫరెన్స్ లీడర్స్ తో లింక్ అప్ ఏర్పాటు చేయాలని మోదీ అనుకుంటున్నారు, దానికి ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుందని అంటాడు. వీడియోలో చివరికి, జీ-7 దేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు అని ఉంటుంది. అంతేకానీ, పోస్ట్ లో చెప్పినట్టు జీ-7 దేశాలకి ప్రధాని మోదీని నాయకత్వం వహించమని అగ్రరాజ్యాలు కోరినట్టు ఎక్కడా కూడా లేదు. అసలు జీ-7 గ్రూప్ (అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు జపాన్) లో ఇండియా మెంబెర్ కూడా కాదు. ఆస్ట్రేలియా కూడా జీ-7 గ్రూప్ లో మెంబెర్ కాదు, అలాంటప్పుడు జీ-7 దేశాలకి నాయకత్వం వహించమని మోడీని ఆస్ట్రేలియా ప్రధాని ఎందుకు కోరుతాడు.
చివరగా, ‘కొరోనా ని అరికట్టడంలో జీ-7 దేశాలకి ప్రధాని మోదీని నాయకత్వం వహించమని కోరిన అగ్రరాజ్యాలు’, అనేది ఫేక్ వార్త.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?