స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకంటించినట్టు చెప్తూ, ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లోని క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
ఫాక్ట్: ఈ సంవత్సరం మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించినట్టు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా (‘Restricted Holiday’) ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సెలవుదినాల లిస్టులో చూడవచ్చు. కావున, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కొత్తగా ఈ సంవత్సరం మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారంలేదు. ఈ సంవత్సరానికి విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సెలవుదినాల లిస్టులో, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా (‘Restricted Holiday’) ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు.
రిస్ట్రిక్టెడ్ సెలవుదినాల లిస్టులో ఏవైనా రెండు రోజులు మాత్రమే ఒక ఉద్యోగి సెలవు తీసుకోవచ్చు. అంతేకాదు, ఉగాది రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా ఎప్పటినుండో ఉంది; కొత్తగా మోదీ ప్రభుత్వం దానిని రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా ప్రకటించలేదు. 2002 సంవత్సరానికి ప్రకటించిన సెలవుదినాల లిస్టులో కూడా ఉగాది రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు.
అయితే, 22 మార్చి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సభ్యుల నుండి అభ్యర్థనలు రావడంతో సభకు సెలవు ప్రకటిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ తెలిపారు. అంతేకానీ, దేశమంతటా మోదీ ప్రభుత్వం కొత్తగా ఉగాదిని గుర్తిస్తూ సెలవు ప్రకటించలేదు.
చివరగా, స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించలేదు.