Fake News, Telugu
 

చిన్న పిల్లలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోమంటున్న ఈ నివారణ చర్యలని శిశు సంక్షేమ శాఖ ప్రకటించలేదు

0

కరోనా వైరస్ మహమ్మారి నుండి పిల్లలను రక్షించుకునేందుకు శిశు సంక్షేమ శాఖ తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన ఈ మార్గదర్శకాలలో చిన్న పిల్లలని బయటకి పంపకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలని తప్ప మిగితా వారి పిల్లలను దగ్గరకు తీసుకోవద్దని, చిన్న పిల్లలకు పాలు పట్టే తల్లులు బయటకి వెల్లకూడదని, అలాగే, పొరుగు ఇళ్ళలో ఆడుకునేందుకు తమ పిల్లలని పంపకూడదని చెప్పినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: శిశు సంక్షేమ శాఖ  కరోనా వైరస్ నుండి పిల్లలను రక్షించుకునేందుకు తల్లిదండ్రులకి జారి చేసిన మార్గదర్శకాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మార్గదర్శకాలని శిశు సంక్షేమ శాఖ ప్రకటించలేదు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ పిల్లల పై ప్రభావం చూపుతుందని కొంత మంది హెచ్చరిస్తుండడంతో, పిల్లలని కరోనా వైరస్ మహమ్మారి నుండి రక్షించుకునేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పోస్టులో తెలిపిన కొన్ని నియమాలని కొందరు డాక్టర్లు కూడా సూచించారు. కాని, ప్రభుత్వం నుండి ఇలాంటి మార్గదర్శకాలేవి ఇంకా జారీ కాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబధించిన వివరాల కోసం కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైటులో వెతకగా, పోస్టులో తెలిపిన మార్గదర్శకాలని జారీ చేస్తూ శిశు సంక్షేమ శాఖ ఎటువంటి ప్రెస్ రిలీజ్ ఇవ్వలేదని తెలిసింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రుత్వ శాఖ 01 ఏప్రిల్ 2020 నాడు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో, పిల్లలకు కరోనా వైరస్ సోకోకుండా పాటించవలిసిన జాగ్రత్తల గురించి ప్రస్తావిస్తూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్లలకు తరచూ హ్యాండ్ వాష్ చేసుకోనే అలవాటు నేర్పాలి అని, మాస్క్ కచ్చితంగా ధరించమని చెప్పాలని, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని, అలాగే, మంచి నిద్ర మరియు విశ్రాంతి ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం ఈ ప్రెస్ రిలీజ్ లో తెలిపారు.  పిల్లలు స్నేహితులతో నేరుగా కలుసుకోలేకపోయినా, ఫోనులో లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా మాట్లాడుకునేల చూడాలని ప్రభుత్వం ఈ ప్రకటనలో పేర్కొంది. పిల్లలని బయటకి పంపకూడదని ఈ ప్రకటనలో ఎక్కడా తెలుపలేదు.

కరోనా వైరస్ థర్డ్ వేవ్ పిల్లల పై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో, పిల్లలని కరోనా వైరస్ మహమ్మారి నుండి రక్షించుకునేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నిపుణల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నీతి అయోగ్ సభ్యడు VK పాల్ తెలిపారు. VK పాల్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఇచ్చిన ప్రెస్ మీట్ యొక్క వీడియోని PIB ట్వీట్ చేసింది.

కరోనా కారణంగా తల్లిదండ్రులని కోల్పయిన చిన్న పిల్లలని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలని ఇక్కడ చూడవచ్చు.

ఇదివరకు, పిల్లలని పార్కులకి పట్టుకొని వెళ్ళిన తల్లిదండ్రులకి కేరళ ప్రభుత్వం 2000 రూపాయిల ఫైన్ విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ ఒకటి షేర్ అయినప్పుడు, ఈ వార్త తప్పని కేరళ పోలీసు వారు స్పష్టం చేసారు. దీనికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. పోస్టులో తెలిపిన కొన్ని జాగ్రత్తలని కొంత మంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేసారు. ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్​ శ్రీహరి కూడా కరోనా వైరస్ థర్డ్ వేవ్ నుండి పిల్లలను రక్షించుకునేందుకు పలు సూచనలు ఇచ్చారు. కాని, పోస్టులో తెలిపిన మార్గదర్శకలని  కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

చివరగా, చిన్న పిల్లలకు కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోమంటున్న ఈ నివారణ చర్యలని శిశు సంక్షేమ శాఖ ప్రకటించలేదు. 

Share.

About Author

Comments are closed.

scroll