Fake News, Telugu
 

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి వ్యక్తుల పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తండ్రి తన తలపాగాను కుమార్తె పాదాల వద్ద ఉంచాడు, అయినప్పటికీ ఆమె వినలేదు మరియు జిహాదీ ముస్లిం బాలుడిని వివాహం చేసుకుంది’ అని ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. వీడియోలోని ఘటన రాజస్తాన్ లోని పాలీ లో జరిగినట్టు పోస్ట్ చేసారు. ఆ ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం కుర్రాడిని వివాహం చేసుకోవద్దని చెప్తూ తండ్రి తన తలపాగాను కుమార్తె పాదాల వద్ద ఉంచుతున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి (రబారీ/దెవాసీ) చెందినవారు. పోస్ట్ లో చెప్పినట్టు అబ్బాయి వేరే మతస్తుడు కాదు. ‘లవ్ జిహాద్’ అని చెప్తూ, తప్పుగా వీడియోని షేర్ చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్-షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించిన మరిన్ని పోస్టులు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఒక పోస్ట్ కింద కామెంట్ చేస్తూ, వీడియోలోని అమ్మాయి పేరు సీత అని, అబ్బాయి పేరు లఖారాం అని, వారు ఇద్దరూ ఒకే రబారీ కమ్యూనిటీ కి చెందినవారు అని ఒక వ్యక్తి ట్వీట్ చేసాడు. వీడియోలోని ఘటనలో ఎటువంటి ‘లవ్ జీహాద్’ లేదని, ఇద్దరు ఒకే కమ్యూనిటీ కి చెందినవారని మరో వ్యక్తి చేసిన లైవ్ వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం కొన్ని కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, ఈ వీడియో పై ‘దైనిక్ భాస్కర్’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. తన తల్లిదండ్రులు సీత కి ఇష్టం లేకుండా గులాబ్ అనే వ్యక్తి తో పెళ్లి చేసారని, అతను ఇష్టం లేకపోవడం, ఒక సంవత్సరం ముందు పరిచయమైన తన బంధువు లఖారాంని ప్రేమించడంతో, అతనితో వెళ్ళిపోయి సీత పెళ్లి చేసుకుందని, తన తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు ఇరుపక్షాలను పిలిచినప్పుడు ఎవరో పోస్ట్ లోని వీడియోని తీసినట్టు ఆర్టికల్ లో చదవొచ్చు. అంతేకాదు, సీత వేరే అతనిని పెళ్లి చేసుకోవడంతో, తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది. వీడియోని పెట్టి, కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు పెరిగేలా పోస్ట్ చేస్తున్నారని, వారి పై తగిన చర్యలు తీసుకుంటామని బాలీ ASP బ్రజేష్ సోని తెలిపినట్టు ఆర్టికల్ లో చదవొచ్చు.

‘ఏసియానెట్ న్యూస్ – హిందీ’ ఆర్టికల్ లో రాత పూర్వకంగా సీత ఇచ్చిన స్టేట్మెంట్ ని చూడవొచ్చు.

చివరగా, వీడియోలోని అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరూ ఒకే రబారీ/దెవాసీ కమ్యూనిటీ కి చెందినవారు. ‘లవ్ జిహాద్’ అని చెప్తూ, తప్పుగా వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll