Fake News, Telugu
 

మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ హయాంలలో ఆర్ధిక వ్యవస్థ పనితీరును పోల్చే క్రమంలో షేర్ చేసిన ఈ గణాంకాలు సరైనవి కావు

0

ఇటీవల కాలంలో తరచూ రూపాయి మారకం విలువ తగ్గతుండడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కన్నా నరేంద్ర మోదీయే ఆర్ధిక వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇతే ఈ క్రమంలోనే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి పలు గణాంకాలను నరేంద్ర మోదీ హయాంలలో నమోదైన గణాంకాలతో  పోల్చిన ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ హయాంలలో పలు ఆర్ధిక సూచిలకు సంబంధించిన  గణాంకాలు.

ఫాక్ట్ (నిజం):  మన్మోహన్ సింగ్  మరియు నరేంద్ర మోదీ హయాంలలో ఆర్ధిక వ్యవస్థను పోల్చి చూసే ప్రయత్నంలో  పలు ఆర్ధిక అంశాలకు సంబంధించిన ఈ గణాంకాలు సరైనవి కావు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించి కేవలం వార్షిక గణాంకాలను విడుదల చేస్తుంది. కానీ వైరల్ పోస్టులో ఎనిమిది సంవత్సరాల వివరాలు కలిపి చెప్పారు. అలా పోల్చడం కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం జీడీపీ-అప్పు నిష్పత్తి, విదేశీ రుణ నిష్పత్తి, ద్రవ్యోల్బణం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే మోదీ ప్రభుత్వంలో తక్కువున్న మాట నిజమైనప్పటికి, ఈ అంశాలలో 2004 నుండి తగ్గుదల కనిపిస్తుంది. ఇక మొత్తం భారత్ చెల్లించాల్సిన అప్పుల నికర విలువ ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో జీడీపీ-అప్పు నిష్పత్తి, విదేశీ రుణ నిష్పత్తి, ద్రవ్యోల్బణం రేటు మరియు మొత్తం అప్పులకు సంబంధించిన గణాంకాల ఆధారంగా మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ హయాంలలో ఆర్ధిక వ్యవస్థ నిర్వహణను పోల్చి చూసే ప్రయత్నం చేశారు.

ఐతే పోస్టులో ఈ సూచీలకు సంబంధించి వార్షిక గణాంకాలు కాకుండా మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న తొమ్మిదిఏళ్లలో (2006 -14) నమోదైన సగటు వివరాలను మోదీ అధికారంలో ఉన్న ఎనిమిది ఏళ్లలో (2014-22) నమోదైన సగటు వివరాలతో పోల్చారు.  కానీ నిజానికి జీడీపీ-అప్పు నిష్పత్తి, విదేశీ రుణ నిష్పత్తి మరియు మొత్తం అప్పులను వార్షికంగా లెక్కిస్తారు. ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ వివరాలు పేర్కొంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ వివరాలు విడుదల చేస్తుంది.

అలాగే  కేంద్ర ప్రభుత్వం నెలలు మరియు సంవత్సరాల వారీగా  ద్రవ్యోల్బణాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రతీ నెల ద్రవ్యోల్బణ వివరాలను ప్రకటిస్తుంది. నెలవారీ ద్రవ్యోల్బణం Y-o-Y ఆధారంగా లెక్కించబడుతుంది, కాగా వార్షిక ద్రవ్యోల్బణం నెలల సగటు ఆధారంగా ఉంటుంది.

పోస్టులో చెప్తున్నట్టు ఈ అంశాలకు సంబంధించి కొన్ని సంవత్సరాల సగటు వివరాలను ప్రభుత్వం ప్రకటించదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో చేసిన పోలిక కరెక్ట్ కాదని అర్ధంచేసుకోవచ్చు. ఇకపోతే ఈ సూచీలకు సంబంధించి ఎవరి హాయాంలో ఎలా ఉండేదో కింద చూద్దాం.

మొత్తం అప్పుల విలువ:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం 2006-07 ఆర్ధిక సంవత్సరం చివరలో భారత దేశం నికరంగా చెల్లించాల్సిన మొత్తం అప్పుల విలువ రూ. 26,37,079 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరాలలో ఇది క్రమంగా పెరుగుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న చివరి సంవత్సరం 2013 -14లో రూ. 58,59,331 కోట్లకు చేరుకుంది.

ఇకపోతే మోదీ ప్రధాని అయిన మొదటి సంవత్సరం 2014-15 భారత్ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ. 64,11,391 కోట్లకు పెరిగింది. ఆ తర్వాతి సంవత్సరాలలో ఇది భారీగా పెరుగుతూ 2021-22  చివరి నాటికి రూ. 1,39,56,343 కోట్లకు చేరుకుంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పైన తెలిపినవి కేవలం ఆ సంవత్సరం చివరి నాటికి భారత్ చెల్లించాల్సిన అప్పుల వివరాలు మాత్రమే కానీ ఆ ప్రభుత్వం చేసిన అప్పుల విలువ కాదు. ఉదాహారణకు 2014-15 చివరి కల్లా  భారత్ చెల్లించాలిసిన అప్పుల విలువ రూ.64,11,391 కోట్లు. అలాగే 2015 -16  చివరి కల్లా  భారత్ చెల్లించాలిసిన అప్పుల విలువ రూ.70,98,298 కోట్లు . అంటే దీని అర్దం మోదీ ప్రభుత్వం 2015 -16  ఒక్క సంవత్సరంలో రూ. 6,86,907 కోట్ల (70,98,298 – 64,11,391) అప్పు చేసినట్టు కాదు. 

ఎందుకంటే ఆ సంవత్సరంలో మోదీ ప్రభుత్వం గత అప్పులకు సంబంధించి వడ్డీ లేదా అసలు చెల్లించే అవకాశం ఉంది, దీనివల్ల మొత్తం చెల్లించాల్సిన అప్పులలో ఆ విలువ తగ్గుతుంది. కాబట్టి పైన తెలిపిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం నికరంగా ఒక సంవత్సరంలో ఎంత అప్పు చేసాయన్న వివరాలు కావని అర్ధం చేసుకోవాలి.

జీడీపీ- అప్పు నిష్పత్తి:

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 2006 -07 ఆర్ధిక సంవత్సరానికి గాను జీడీపీలో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పుల (అంతర్గత + విదేశీ) వాటా 61.40%గా  ఉండేది. ఆ తర్వాతి సంవత్సరాలలో ఇది క్రమేపీ తగ్గి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న చివరి ఆర్ధిక సంవత్సరం 2013-14లో ఇది 52.16%కి చేరుకుంది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ సంవత్సరం విడుదల చేసే హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీలో ఈ వివరాలు అందుబాటులోకి తెస్తుంది.     

అలాగే మోదీ మొదటిసారి ప్రధానమంత్రిగా వ్యవహరించిన 2014 -15లో జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పుల వాటా 51.42%గా  నమోదు కాగా, ఆ తర్వాతి సంవత్సరాలలో ఇది స్వల్పంగా తగ్గి 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 50.87%కి చేరుకుంది.

దీని ప్రకారం కాంగ్రెస్ రెండవసారి అధికారంలో ఉన్నప్పుడు జీడీపీలో కేంద్ర ప్రభుత్వ అప్పుల వాటాకి, ప్రస్తుతం ఉన్న వాటాకి పెద్ద తేడా లేదు. ఆలాగే మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు కలిపి చూస్తే కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది.

విదేశీ రుణ నిష్పత్తి:

కేవలం కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే జీడీపీలో విదేశీ రుణాల వాటా కూడా  మన్మోహన్ సింగ్ హయాం నుండి తగ్గుతూ వస్తుంది. 2006 -07లో జీడీపీలో విదేశీ రుణాల వాటా 4.68% కాగా, ప్రతీ సంవత్సరం స్వల్పంగా తగ్గుతూ 2013-14 నాటికి ఇది 3.33%కు చేరుకుంది.     

మోదీ ప్రధానమంత్రిగా వ్యవహరించిన మొదటి ఆర్ధిక సంవత్సరంలో (2014-15) జీడీపీలో విదేశీ రుణాల వాటా 2.94%గా  నమోదైంది. ప్రస్తుతం (2020-21) ఇది 2.62%గా ఉంది. 

ద్రవ్యోల్బణం రేటు :

పైన తెలిపనట్టు ద్రవ్యోల్బణం రెండు విధాలుగా లెక్కిస్తారు. Y-o-Y ఆధారంగా నెలవారీ ద్రవ్యోల్బణం మరియు నెలల సగటు ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం లెక్కిస్తారు.

కాంగ్రెస్ అధికారంలో 2006-07 సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 6.7%గా  నమోదైంది. ఐతే ఆ తర్వాతి సంవత్సరాలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరుగుతూ – తగ్గుతూ వచ్చింది. అయితే 2009లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 12.31%కి పెరగి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని చివరి సంవత్సరం 2013-14 లో 9.4% నమోదైంది.

మోదీ ప్రభుత్వం వచ్చిన తరవాత ద్రవ్యోల్బణం తగ్గిన మాట నిజమే. 2014-15 లో 5.9% నమోదై, ఆ తర్వాతి సంవత్సరాలలో తగ్గుతూ 2018 -19లో 3.4%గా  నమోదైంది.

ఐతే ఇటీవల కాలంలో నెలనెలా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండో టర్మ్ తో పోలిస్తే మోదీ ప్రభుత్వంలో నమోదైన సగటు వార్షిక ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది.

చివరగా, మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ హయాంలలో ఆర్ధిక వ్యవస్థ పనితీరును పోల్చే క్రమంలో షేర్ చేసిన ఈ గణాంకాలు సరైనవి కావు. 

Share.

About Author

Comments are closed.

scroll